స్తోత్రింతుము నిను మాదు తండ్రి

“దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.” యోహాను John 4:24

పల్లవి : స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు

అనుపల్లవి : పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం

1. శ్రేష్ఠ యీవుల యూట నీవే – శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున
త్రిత్వమై యేకత్వమైన త్రి-లోక నాథా శరణం శరణం
|| స్తోత్రింతుము ||

2. పాపి మిత్రుడ పాప నాశక – పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా – పరిశుద్ధాంగుడ శరణం శరణం
|| స్తోత్రింతుము ||

3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ – సత్యరూపి యనబడు వాడా
నను రక్షించిన రక్షకుండవు – నాథ నీవే శరణం శరణం
|| స్తోత్రింతుము ||

4. బంగారు వెంట్రుకలు తలపై – ఉంగరములుగ కనబడినవి
వేలలో నతి కాంక్షణీయుడా – వేలకొలది శరణం శరణం
|| స్తోత్రింతుము ||

5. గువ్వల వంటి కన్నులు – పువ్వుల వంటి చెక్కిళ్ళు
మంచి రూపము కలిగినందున – మాకు నీవే శరణం శరణం
|| స్తోత్రింతుము ||

6. చేతులు బంగారుమయము – చెక్కిన రత్నముల వంటివి
కాళ్ళు రాతిస్తంభములవలె – కన్పడుచున్నందున శరణం
|| స్తోత్రింతుము ||

7. సంఘమునకు శిరస్సు నీవే – రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి – కోట్లకొలది శరణం శరణం
|| స్తోత్రింతుము ||

8. నీదు సేవకుల పునాది – జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు – వేడుకొందము శరణం శరణం
|| స్తోత్రింతుము ||

9. రాజ నీకే నమస్కారములు – గీతములు స్తుతి స్తోత్రములు
శుభము శుభము శుభము నిత్యము – హల్లెలూయా ఆమేన్ ఆమేన్
|| స్తోత్రింతుము ||

Leave a Comment