శాంతిదాయక యేసు ప్రభూ

“నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు” పరమగీతము Song Of Songs 5:10

పల్లవి : శాంతిదాయక యేసు ప్రభూ
శాంతిదాయక యేసు శాంతిదాయక

1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ – మహిమపూర్ణుడ మనోహరుడా
నిత్య రాజ్య మహిమకు పిల్చిన – సత్యముగ నిన్ను పూజించెదము
|| శాంతిదాయక ||

2. పరజనులను పరదేశులను – పరిశుద్ధులతో నైక్యపరచి
పరలోక పౌరులుగా మార్చి – పరలోక పిలుపుకు లోబర్చిన
|| శాంతిదాయక ||

3. సువార్తతో మమ్ము పిలిచితివి – సువార్తికులుగ చేసితివి
రిక్తులకు మహదైశ్వర్య మిచ్చి – శక్తితో వారసులుగ చేసిన
|| శాంతిదాయక ||

4. ఆదియం దేర్పరచు కొంటివి – ఏవి నీచమో ఏవి ఘనమో
గురుతుపట్టి ఎరుగ మంటివి – నోరుగ జేతునను వాగ్దానము
|| శాంతిదాయక ||

5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా – పదివేలలో గుర్తింప యోగ్యుడా
బోధింప నేర్పు శుద్ధాత్ముని – శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె
|| శాంతిదాయక ||

6. అక్షయ జీవమిచ్చిన రక్షక – పరీక్షలో నిల్చు నిరీక్షణలో
అక్షయ దేహ మిచ్చెదవని – ప్రత్యక్షతకై వేచియుండెదము
|| శాంతిదాయక ||

7. సర్వ కృపానిధి సర్వేశ్వరా – సర్వము స్వతంత్రించుకొన
ఉర్వియందు విజయములే యని – సర్వోన్నతుడు నుడివెను
|| శాంతిదాయక ||

8. పరలోకానంద పరిపూర్ణుడా – సకలాశీర్వాద సంయుతుడా
మహిమ ఘనత ప్రభావంబులు – నీవే యని ప్రహర్షించెదము
|| శాంతిదాయక ||

రాత్రింబవళ్లు పాడెదను

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” లూకా Luke 12:32

పల్లవి : రాత్రింబవళ్లు పాడెదను
యేసు నామం – క్రీస్తు నామం

1. పురుగు వంటి నరుడ నాకు – ప్రభువు రాజ్య మియ్యదలచి
పరమునుండి ధరకేతెంచి – ప్రాణమున్ బలిగా నిచ్చె
|| రాత్రింబవళ్లు ||

2. ఎన్నిక లేని చిన్నమంద – భయపడకు నీవిలన్
ఘనమైన పరమతండ్రి – రాజ్యమివ్వ నిష్టపడెన్
|| రాత్రింబవళ్లు ||

3. పాప కూపమునందు నేను – పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి పరమ – రాజ్యమందు చేర్చెను
|| రాత్రింబవళ్లు ||

4. నీతి హీనుడనైన నాకు – నీతి రాజ్యమివ్వదలచి
నీతి రక్షణ వస్త్రములను – ప్రీతి తోడ తొడిగెను
|| రాత్రింబవళ్లు ||

5. పేరుపెట్టి పిలచినన్ను – పరమ రాజ్యమును తండ్రి
వారసునిగా నన్ను జేసి – వైరినిల సిగ్గుపరచెన్
|| రాత్రింబవళ్లు ||

6. పరమునందు దూతలు – వింత పొందునట్లుగా
ఏర్పరచుకొంటివి నరుని – నరుడు ఏపాటి వాడు?
|| రాత్రింబవళ్లు ||

7. దానియేలు షద్రక్ మేషాక్ – అబెద్నెగో యనువారలన్
చిన్నమందగాను జేసి – రాజ్యమేల జేసెన్
|| రాత్రింబవళ్లు ||

8. ఎన్ని శ్రమలు వచ్చినను – సన్నుతింతు నా ప్రభున్
ఘనత మహిమ కర్హుడని – హల్లెలూయ పాడెదన్
|| రాత్రింబవళ్లు ||