వందనమో వందన మేసయ్యా

“శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” యూదా Jude 1:25

పల్లవి : వందనమో వందన మేసయ్యా – అందుకొనుము మా దేవా
మాదు – వందన మందుకొనుమయా

1. ధరకేతించి ధరియించితివా – నరరూపమును నరలోకములో
మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా
నీకిదే వందన మందుకొనుమయా
|| వందనమో ||

2. పాపిని జూచి ప్రేమను జూపి – కరుణా కరముచే కల్వరి కడకు
నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ
ప్రేమకు సాటియే లేదిలలోన
|| వందనమో ||

3. ఉదయించితివా నన్నుద్ధరింప – ధరియించితివా దారుణ మరణము
దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా
దేవా హృదయార్పణ నర్పింతు
|| వందనమో ||

4. అనాధుండను నా నాథుండా – అండవై నాకు బండగ నుండు
అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు
క్రీస్తుండా స్తుతిపాత్రుండ – స్తుతించు
|| వందనమో ||

5. జగమును వీడి పరమున కరిగి – పరిశుద్ధాత్మను వరమును విరివిగ
నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా
రాజా నీకిదే నా స్తుతియాగం
|| వందనమో ||

6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో
ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు
క్షితినిన్ చేరి స్తుతింతు
|| వందనమో ||

7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ – వర్ణనాతీతుడా ధవళవర్ణుడా
రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా
నీకిదే వందనమందుకొనుమయా
|| వందనమో ||

నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

“(సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని” ప్రకటన Revelation 1:13

పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
1. అల్ఫాయు ఓమేగ వర్తమాన – భూత భవిష్యత్తులో నున్నవాడా
నా సర్వము నిర్వహించువాడా – సర్వాధికారి నిన్నే స్తుతించి
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

2. ఏడు సువర్ణ దీపస్తంభముల – మధ్య సంచరించుచున్నవాడా
శుద్దీకరించితివి నన్ను – మేలిమిగ మార్చి సంఘమున
చేర్చితివి నిన్నే ఆరాధింతు
|| నేనే ||

3. తెల్లని ఉన్నిని పోలియున్న – వెంట్రుకలు కలిగి యున్నవాడా
ఆలోచనకర్త నీవే నాకు – జ్ఞానమైతివి అసమానుండ
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

4. సూర్యుని వంటి ముఖము కలిగి – అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
దృష్టించితివి నా హృదయమున్ – దహించితివి దుష్టత్వము
ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు
|| నేనే ||

5. అపరంజిని పోలిన పాదములు – కలవాడా తీర్పు తీర్చితివి
పాపము లోకములనిల – దుష్ట సాతానున్ సిలువలో గెలిచి
విజయ మిచ్చినందుల కారాధింతున్
|| నేనే ||

6. నీ నోటినుండి బయలువెడలె – రెండంచులు గల వాడి ఖడ్గము
అదియే పాత ఆదామును చంపె – నశింప చేసె నా శత్రుబలమున్
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన – మొదటివాడా కడపటివాడా
సర్వ సంపూర్ణత నాకిచ్చితివి – అపాయములలో ఆదుకొనుచున్న
ఆమేన్ అనువాడా హల్లెలూయ
|| నేనే ||