దేవదేవుని కొనియాడెదము

“దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును.” కీర్తన Psalm 136:2

పల్లవి : దేవదేవుని కొనియాడెదము – అవిరత త్రియేకుని స్తోత్రింతుము

అనుపల్లవి : ఏపుగా దయాళుని పొగడెదము
పాప పరిహారుని పాడెదము

1. దూతలు స్తుతించు మహోన్నతుడు
కన్యమరియ యందు జన్మించెను
మహియందు చీకటి పోగొట్టి
ఇహపర సుఖముల దయచేసెను
|| దేవదేవుని ||

2. పాపశాపమును తీర్చను
పాట్లుపడెను దేవ గొఱ్ఱెపిల్ల
హా! మంచి గొఱ్ఱెల బోయడే
ప్రాణము నిచ్చెను మనకై
|| దేవదేవుని ||

3. పాపముల కడిగి రక్షించెను
కృపనిచ్చె వేచియుండుటకై
వైరిని జయింపను శక్తినిచ్చెను
నరులకు భాగ్యము నందించెను
|| దేవదేవుని ||

4. ఆకాశము నుండి దిగి వచ్చును
లోకమున్ న్యాయము తీర్చుటకై
ఆయత్తముగ కాచియుండెదము
పాయక వివేక కన్యల వలె
|| దేవదేవుని ||

5. తన స్వరూపము నే దాల్చను
ఆయనే నా రూపము దాల్చెన్
దాసుడనగు నన్ను రక్షింపన్
యేసు నరరూపము దాల్చెన్
|| దేవదేవుని ||

6. పాతాళ లోకము కూల్చవచ్చెన్
జాతి యడ్డుగోడ పడగొట్టెను
నిత్య జీవంబు నియ్యను వచ్చెను
నీతి సూర్యుడు ప్రభు యేసువే
|| దేవదేవుని ||

7. హల్లెలూయ పాడి ఆర్భటింతుము
హర్షముతో యేసున్ చాటెదము
బలుడైన తండ్రిని కీర్తింతుము
విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము
|| దేవదేవుని ||

నా ప్రాణ ప్రియుడా యేసురాజా

“ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” యెషయా Isaiah 9:6

పల్లవి : నా ప్రాణ ప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా

1. అధ్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్
|| నా ప్రాణ ప్రియుడా ||

2. విమోచన గానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా
|| నా ప్రాణ ప్రియుడా ||

3. గర్భమున పుట్టిన బిడ్డను – కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీవెన్నడు
మరువవు విడివవు ఎడబాయవు – కరుణారాజా
|| నా ప్రాణ ప్రియుడా ||

4. రక్షణాలంకారములను – అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు – స్తుతింతును
|| నా ప్రాణ ప్రియుడా ||

5. నీ నీతిని నీ రక్షణను – నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును – విమోచకుడా
|| నా ప్రాణ ప్రియుడా ||

6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ – విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ
|| నా ప్రాణ ప్రియుడా ||