మన బలమైన యాకోబు దేవునికి

పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి
గానము సంతోషముగా పాడుడీ

అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి
సితార స్వరమండలము వాయించుడి

1. అమావాస్య పున్నమ పండుగ దినములందు
కొమ్మునూదుడి యుత్సాహముతోడ
యాకోబు దేవుడు నిర్ణయించిన
ఇశ్రాయేలీయుల కది కట్టడ
|| మన బలమైన ||

2. తానైగుప్తులో తిరిగినప్పుడు
యోసేపు సంతతికి సాక్షముగ
నిర్ణయించెను దేవుడు అచ్చట
నే నెనుగని భాషను నే వింటిని
|| మన బలమైన ||

3. తమభుజము నుండి బరువు దింపగ
మోతగంపల భారము దప్పెను
నీవాపదయందు మొఱపెట్టగా
విడిపించిన యెహోవాను నేనే
|| మన బలమైన ||

4. ఉరుము దాగుచోటులో నుండినే
ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
మెరీబా జలముల యొద్ద నిన్ను
నా ప్రజలారా నా మాట వినుడి
|| మన బలమైన ||

5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను
రప్పించిన యెహోవా దేవుడను
నీవు నీ నోరు బాగుగా తెరువుము
నేను నింపెదను మంచి వాటితో
|| మన బలమైన ||

6. అతి శ్రేష్ఠమైన గోధుమలను
అనుగ్రహించి పోషించెద నిన్ను
కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో
తృప్తి పరచెదను నిత్యముగా
|| మన బలమైన ||

7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట
వినిన పక్షాన ఎంత మేలగు
అన్యదేవతల నెవ్వరికిని
నీవు ఎన్నడు పూజ చేయరాదు
|| మన బలమైన ||

దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి

1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి
చెవియొగ్గువరకు మనవి చేయుచుందును

2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను
ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును

3. పూర్వ సంవత్సరములను తలచుకొందును
పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును

4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు
శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది

5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా?
ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా?

6. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా?
దేవుడు కోపముతో కృప చూపకుండునా?

7. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను
అనుకొనుటకు నా శ్రమలే కారణము

8. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను
తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు

9. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును
నీ క్రియలను ధ్యానము నే జేసికొందును

10. మహా పరిశుద్ధమైనది నీదు మార్గము
మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?

11. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే
జనములలో ప్రభావమును చూపియున్నావు