స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు

“నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక.” కీర్తన Psalm 70:4

పల్లవి : స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా

1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సహించి సంతోషించెదము
కొనియాడెదము మరువబడని మేలులజేసెనని
|| స్తుతియు ||

2. నీ వొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు
నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము
|| స్తుతియు ||

3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై
ఖ్యాతిగ నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా
|| స్తుతియు ||

4. నీవే మాకు పరమప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా
నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను
|| స్తుతియు ||

5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మాకొరకై
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్
పరము నుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము
|| స్తుతియు ||

ఘనత మహిమ ప్రభుకే

“యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.” కీర్తన Psalm 145:3

పల్లవి : ఘనత మహిమ ప్రభుకే
తర తరములలో తనకే చెల్లును గాక

1. నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదము
అద్భుతములను చేయు దేవుడు వినుతించెదము విమలాత్ముడని
|| ఘనత ||

2. పావన ప్రభుయేసుండు పరమ దీవెనలు మనకిచ్చెను
తరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతియించెదము
|| ఘనత ||

3. మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగాను
తన శిరసత్వములో మనలుంచి మనల నడుపు రారాజునకే
|| ఘనత ||

4. మాట తప్పని దేవుడేగ మేటిగ నెరవేర్చె వాగ్దానము
ధీటైన జనముగ మము జేసెనుగ మెండుగ మమ్ము దీవించెనుగా
|| ఘనత ||

5. పరమప్రభువు మనకొరకు అర్పించుకొనెను తన్ను తానే
సర్వము మనకు యిచ్చిన ప్రభునే సర్వద మనము స్తుతియించెదము
|| ఘనత ||

అసమానుండగు ఓ క్రీస్తు – అద్వితీయుండగు దేవా

“ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము” కొలొస్స Colossians 1:18

పల్లవి : అసమానుండగు ఓ క్రీస్తు – అద్వితీయుండగు దేవా
అల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2)

1. ఇహపరములలో నీ జన్మ – మహానందము కలిగించె (2)
అభయము నిచ్చి మాకు – భయభీతిని బాపితివి (2)
భయభీతిని బాపితివి
|| అసమానుండగు ||

2. నీ జీవిత వాక్కులన్ని – సజీవము జనులందరికి
పావనుడా మా ప్రభు యేసు – అవనికి మాదిరి నీవే
|| అసమానుండగు ||

3. మరణము గెల్చిన మా ప్రభువా – పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి – నీతిగా మము తీర్చితివి
|| అసమానుండగు ||

4. పాపశాపముల బాపితివే – చూపితివే పరమదారి
శక్తిగల ఓ ప్రభువా – నీకే మా స్తోత్రములు
|| అసమానుండగు ||

5. విశ్వమంతట ఓ దేవా – శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది – ఉన్నతమైన ప్రేమ
భయభీతిని బాపితివి
|| అసమానుండగు ||

6. సంఘమునకు శిరస్సు నీవే – అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా – సర్వ మహిమ నీకే
|| అసమానుండగు ||

ప్రణుతింతుము మా యెహోవా

“యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” కీర్తన Psalm 4:8

పల్లవి : ప్రణుతింతుము మా యెహోవా
పరిపూర్ణ మహిమ ప్రభావా
ప్రబలెన్ నీ రక్షణ మా విభవా

1. నేను నిదురబోయి మేలు కొందును
నాపైన పదివేలు మోహరించినను
నేనెన్నడు వెరువబోను
|| ప్రణుతింతుము ||

2. నా మీదికి లేచి భాధించువారు
వానికి రక్షణ లేదనువారు
వేలాదిగా నిల్చినారు
|| ప్రణుతింతుము ||

3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు
విలపించి వేడినయట్టి దినమందు
వింతగ రక్షించితివంచు
|| ప్రణుతింతుము ||

4. రక్షణనిచ్చుట మన యెహోవాది
రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు
రంజిల్లు నీ ధరణియందు
|| ప్రణుతింతుము ||

5. నీ అందచందాల మోము మెరిసింది
నీ మాటలమృత ధారలొలికింది
నిన్నే ప్రేమించి పూజింతున్
|| ప్రణుతింతుము ||

మా ప్రభుయేసు నీవే మా సర్వము

“నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు” కీర్తన Psalm 36:8

పల్లవి : మా ప్రభుయేసు నీవే మా సర్వము
మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము

1. సంతృప్తి నీ మందిరమున గలదు
అందానంద ప్రవాహంబు మెరిసింది
వింతైన జీవపు యూటందు గలదు
యెంతైన మా పూజార్హుండ వీవే
|| మా ప్రభుయేసు ||

2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు
మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
సతతంబు మా పూజార్హుండ వీవే
|| మా ప్రభుయేసు ||

3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో
మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
యెక్కడైనా మా యేసు సన్నిధిలో
|| మా ప్రభుయేసు ||

4. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము
పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
పాలించుము ప్రభుయేసు రారాజ
|| మా ప్రభుయేసు ||

5. సోదర ప్రేమ సమాధానంబులతో
సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమాళాలతో
వినయంబున పూజింతుము నిన్ను
|| మా ప్రభుయేసు ||