ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి

“నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.” గలతీ Galatians 2:20

పల్లవి : ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై

1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై – స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ
|| ప్రభుయేసు ||

2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ – కరుణించి నా స్థితిని జూచి
కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ – కడు వేదనతో యేడ్చితివి
|| ప్రభుయేసు ||

3. కొరడా దెబ్బలచే నీ దేహమంత – చారలుగ దున్నబడెను
శరీరమంత రక్తమయమాయెను – వరదా! గాయము లొందితివా
|| ప్రభుయేసు ||

4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి – బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను – ఓర్చితివా మౌనము వహించి
|| ప్రభుయేసు ||

5. ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై – పాపము నుండి విడిపించుటకు
పొందితి నెంతో గొప్ప రక్షణను – పశ్చాత్తాపము ద్వారా నేను
|| ప్రభుయేసు ||

6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ – ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే – పొందుగ నీ వాడనైతి
|| ప్రభుయేసు ||

7. నా యెడల నీదు సంకల్పమేగా – నీ స్వాస్థ్య మనుభవించుటకు
నీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి
|| ప్రభుయేసు ||

దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం

“ఒక దివ్యమైన సంగతితో నా హౄదయము బహుగా ఉప్పొంగుచున్నది” కీర్తన Psalm 46:1

పల్లవి : దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం

1. నీ నామమును నే ఘనపరచి – హెచ్చించి పూజింతున్
శ్లాఘించి కొనియాడుటలో – నాకిచ్చిన నీ కృపకై
|| దేవా ||

2. ఎండిన భూమిలో లేత మొక్కవలె – పలుశ్రమలను పొందితివి
వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది – నా శిక్షను పొందితివి
|| దేవా ||

3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు – నా ప్రియుడవు నీవే ప్రభూ
పదివేలలో నిను గుర్తించెదను – నా పరమ పితా నిన్ను
|| దేవా ||

4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు – రారాజు రూపమును
నిరతంబును చూచె నిరీక్షణతో – నింగిని నే జూచెదను
|| దేవా ||

యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని

“తన్ను ఎందరంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” యోహాను John 1:12

యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని
పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి

పల్లవి : వందన మర్పింతు కృపనొందితి
తన రాజ్యమందున చేరితిని

1. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె
చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె
|| వందన ||

2. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె
నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె
|| వందన ||

3. పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని
రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ
|| వందన ||

4. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును
ఆదినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను
|| వందన ||

నీ జల్దరు వృక్షపు నీడలలో

“ఆనందభరితనై … నేనతని నీడను కూర్చుంటిని” పరమ గీతము Song Of Songs 2:3

నీ జల్దరు వృక్షపు నీడలలో
నే నానంద భరితుడనైతిని
బలురక్కసి వృక్షపుగాయములు
ప్రేమాహస్తములతో తాకు ప్రభు

1.నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలిచితివి
నీ శిరము వానకు తడిసినను
నను రక్షించుటకు వేచితివి

2. ఓ ప్రియుడా నా అతిసుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి
|| నా హృదయపు ||

3. నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారస ధారలకన్న మరి
నీ ప్రేమే ఎంతో అతిమధురం
|| నా హృదయపు ||

4. ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చు చున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను
|| నా హృదయపు ||

5. నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి
పరమా గీతములను నేర్పితివి
|| నా హృదయపు ||

శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!

“సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3

1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!
ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము!
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా
ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!

2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు
పరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు
సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి
నిత్యుడవైన నిన్ స్తుతింతురు

3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ
పాపి కన్ను చూడలేని మేఘవాసివి
అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను
కరుణ, శక్తి, ప్రేమ రూపివి

4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు
సృష్టి జాలమంత నీకీర్తి బాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!
ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!