నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ

వారు ― సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.” యెషయా Isaiah 6:3

1. నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ
గృపా జయప్రభావముల్ – నుతింతు నెంతయున్

2. కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా
భవత్ప్రభావ కీర్తులన్ – జాటంగ నెల్లడన్

3. భయంబు చింతబాపును – హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు – నీనామ మిచ్చును

4. విముక్తి జేయు ఖైదిని – పాపంబు బావును
పాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము

5. జనాళి పాపు లెల్లరు – శ్రీ యేసున్ నమ్ముడి
కృపా విముక్తులందరు – సంపూర్ణ భక్తితో

6. అర్పించె యేసు ప్రాణమున్ – నరాళిగావను
యజ్ఞంబు దేవ గొఱ్ఱెపై – నఘంబు వేయుడి

7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల – నభావ భూమిని
సర్వత్ర దేవుడొందుగా – సద్భక్తవాళిచే

ఆద్యంత రహిత ప్రభువా

నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.” ఆదికాండము Genesis 17:1

పల్లవి : ఆద్యంత రహిత ప్రభువా
రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా

1. ఆది జనకుడు ఏదేను తోటలో
శోధనలో పడి వేధించినపుడు
ఆశలన్ని అడియాశలుగా జేసె
అధములను నీవు ఆదరింతువు
అమృతమూర్తి నీవే – ప్రభూ – సాటి నీకెవరు?
|| ఆద్యంత ||

2. స్థానము విడచి తన మహిమ విడచి
అనుదినము నిను దూషించు వైరి
ప్రధానత్వమును పాడుచేసికొని
నీ ప్రభుత్వమున్ నిరాకరించిన
నీచున్ ప్రేమించితివి – ప్రభూ – సాటి నీకెవరు?
|| ఆద్యంత ||

3. పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని
వేలకొలది వాగ్దానములతో
కలిమియందున కలతలందున
తొలగిపోయిన తల్లడిల్లిన
చల్లగ కాచితివి – ప్రభూ – సాటి నీకెవరు?
|| ఆద్యంత ||

4. రాజ్యమేలిరి రారాజు లెందరో
రాజనగరుల రత్నాల సిరులతో
రాజ్యకాంక్షతో రణములు సలిపిరి
రథములను చూచి సదయున్ మరచిన
నిత్య సాత్వీకుడవు – ప్రభూ – సాటి నీకెవరు?
|| ఆద్యంత ||

5. పరమ జనకుని పలు వాక్కు లెన్నియో
ధరను ప్రజలకు ప్రవచించు కొరకై
నిర్ణయించితివి దైవజనులను
పేరాశ కలిగి పెడత్రోవ నడచిన
కరుణించితివి వారిన్ – ప్రభూ – సాటి నీకెవరు?
|| ఆద్యంత ||

6. పాడెదన్ ప్రభూ నీ ప్రేమగీతం
పడిచెడిన నన్ను ప్రేమించితివివని
కడిగితివి ప్రభు – కలుషమునెల్ల
విడచిన నేను నీ జాడలన్నియు
నడిపించె నావికుడ – ప్రభూ – సాటి నీకెవరు?
|| ఆద్యంత ||

దేవా నాయందు నీకు – ఎంతో ప్రేమా

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.” యిర్మియా Jeremiah 31:3

పల్లవి : దేవా నాయందు నీకు – ఎంతో ప్రేమా
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
హల్లెలూయా … (4)

1. దిన దినము నీదు ప్రేమ – రుచిచూచుచున్నాను
దయగల జీవాహారముతో – పోషించుచున్నావు
దేవా! నీ జీవ జలము – నాకిచ్చితివే
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

2. నా పాదములను నీవు – బండపై నిలిపితివి
నా యడుగుల నెల్ల నీవు – స్థిరపరచిన దేవుడవు
దేవా! నా కాశ్రయుడవు – నీవే కదా
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

3. సిలువలో నీ రక్తము కార్చి – నన్ను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన – నన్నైక్య పరచితివి
దేవా నీ దయ నా యెడల – అత్యున్నతము
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

4. వాగ్దానములను నాలో – నెరవేర్చిన ఓ ప్రభువా
విడువక నా యెడల నీదు – కృప జూపుచున్నావు
దేవా! నీ మారని ప్రేమ – సంపూర్ణము
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

5. మృతిని గెల్చి మాకొరకై – తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై – యున్న మహిమ రాజా
దేవా! నీ సన్నిధి నాకు – ఎంతో ప్రియము
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా

“నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు” పరమ గీతము Song Of Songs 5:10

పల్లవి: కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా

1. పరిశుద్ధుడవు నీతిమంతుడవు
పాపపు వస్త్రము మార్చిన దేవ
ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను ధవళవర్ణుడా

2. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి
బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను నీ ఘనవిజయము
భజియించెద నిన్ను రత్నవర్ణుడా

3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను
ఘనుడా నాకు ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద

4. ఆరాధించెద ప్రభువా దేవా
ఆత్మతోను సత్యముతోను
తిరిగి రానై యున్న ప్రభువా
స్తుతియు ఘనత మహిమయు నీకే

క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ

“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు.” ప్రకటన Revelation 14:3

క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ
యేసుని కీర్తింతును
పరిమళ తైలమును పోలిన
నీ నామమునే ప్రేమింతును

పల్లవి : హల్లెలూయా స్తుతి హల్లెలూయా
నా ప్రభు యేసుని గూర్చి పాడెదను
ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన
ప్రభుని కీర్తింతును

1. గత కాలమంతయు కాపాడెన్
కష్టబాధలు కలుగకుండ
తన ఆశీర్వాదంబులు నాకొసగి
సుఖభద్రతనిచ్చెన్
||హల్లెలూయా||

2. కొన్ని వేళలు క్షణకాలము
తన ముఖమును కప్పుకొనెను ప్రభువే
తన కోపము మాని తిరిగి నా యెడల
కుమ్మరించును కృపను
||హల్లెలూయా||

3. కరువు లధికంబగు చుండినను
ప్రభు ఆశ్రయముగనుండు
పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ
ప్రభు మమ్ము కాపాడెన్
||హల్లెలూయా||

4. ప్రభు త్వరగా వచ్చును సంతసముగ
మమ్ము జేర్చను పరమందు
కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు
ఆశతో గాంచెదము
||హల్లెలూయా||