మహాఘనుడు మహోన్నతుడు

“మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసి” యెషయా Isaiah 57:15

పల్లవి : మహాఘనుడు మహోన్నతుడు
పరిశుద్ధుడు నిత్యనివాసి
మా సామర్థ్యము పునరుత్థానము
మా జీవము మా రక్షణనిధి

1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో
నివసించువాడు పరిశుద్ధుడు
అయినను – నలిగిన వినయంపు
దీనమనస్సులో నివసించును జీవించును
|| మహాఘనుడు ||

2. దినమెల్ల ప్రభుకై వధియింప
బడి యున్నట్టి గొఱ్ఱెలము
అయినను – ప్రేమించినవాని
ప్రేమను బట్టియే పొందితిమి విజయమును
|| మహాఘనుడు ||

3. మోసము శిక్షయు దుఃఖమును
దరిద్రత కలిగియున్నాము
అయినను – సత్యము జీవము
సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి
|| మహాఘనుడు ||

4. పడిపోయి మేముంటిమి
అంధకారమందుంటిమిగా
అయినను – తిరిగి లేతుము
యెహోవాయే మా వెలుగు మా రక్షణ
|| మహాఘనుడు ||

5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు
నిందకు పాత్రులమైతిమి
అయినను – ఎల్లప్పుడు వూరేగించును
మమ్ము విజయముతో స్తోత్రములు
|| మహాఘనుడు ||

సర్వ కృపానిధియగు ప్రభువా

“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు.” ప్రకటన Revelation 14:3

సర్వ కృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తొత్రముచేసి స్తుతించెదము
సంతసముగ నిను పొగడెదము

పల్లవి : హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను
ఆనందముతో సాగెదను
నే నానందముతో సాగెదను

1. ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి
|| హల్లెలూయా ||

2. అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృప నిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడచుటకు నను పిలచితివి
|| హల్లెలూయా ||

3. మరణ శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చీతివి
|| హల్లెలూయా ||

4. భువినుండి శ్రేష్ఠ ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండినను
ప్రేమించి క్రయధన మిచ్చితివి
|| హల్లెలూయా ||

5. ఎవరు పాడని గీతమును
యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను
యేసుకు నేనేమివ్వగలను
|| హల్లెలూయా ||

స్తోత్ర గీతములను పాడుచు

“అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను. నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.” పరమగీతము Song Of Songs 2:4

పల్లవి : స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి

1. రారండి సంతసించుచు – రారాజును కీర్తించను
రాజులకు రాజని – ప్రభువులకు ప్రభువని
రమ్యమైన రాజును స్తుతించెదం
|| స్తోత్ర ||

2. సిలువలో బలియాయెను – విలువైన రక్తము కార్చెను
ఎంత శ్రమనొందెను – ఎంత బాధ నోర్చెను
తన రక్తముతో మనల కొనెగదా
|| స్తోత్ర ||

3. విందు శాలకు తెచ్చెను – ప్రేమ ధ్వజము పైకెత్తెను
వింత సుందరుడని – వేలలో శ్రేష్ఠుడని
ఎంతైన జేయు సామర్థ్యుడని
|| స్తోత్ర ||

4. మన ఆత్మ ప్రాణ – దేహముల్ – సజీవముగ నర్పింతుము
అత్తరును పూసిన – మరియ వలె మనమును
పరిమళంబులన్ వ్యాపింప జేయుదం
|| స్తోత్ర ||

5. ప్రశంసించె ప్రభువు మరియను – మంచి కార్యము చేసెనని
ప్రభువు కొరకు చేయుము – ప్రాణము నర్పించుము
ప్రభువే సర్వము మనకు
|| స్తోత్ర ||

6. మరణమున్ తానే గెల్చెను – సైతానును ఓడించెను
మరణమున్ మ్రింగెను – మరణముల్లు విరిచెను
జయము జయమటంచు ఆర్భటించెదం
|| స్తోత్ర ||

7. ఆర్భాటముగా ప్రభువు – మేఘారూఢుడై వచ్చును
నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే
మహిమ దేహములను పొంది యుందుము
|| స్తోత్ర ||.

హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

“యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము.” కీర్తనలు Psalm 135:3

పల్లవి : హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద
1. సిలువలో నాకై రక్తము కార్చి
నన్ను రక్షించిన ఓ ప్రభువా
|| హల్లెలూయ ||

2. నిర్దోషమైన యేసుని రక్తము
నా పాపదోషమంత కడిగె
|| హల్లెలూయ ||

3. నీవు గావించిన బలియాగముకై
సాగిలపడి పూజించెదను
|| హల్లెలూయ ||

4. నా యడుగులను బండపై నిలిపి
స్థిరపరచి కాచితివి
|| హల్లెలూయ ||

5. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై
నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా
|| హల్లెలూయ ||

6. యెట్లుండగలను నీ పాట పాడక
పొంది యున్నట్టి మేలులకై
|| హల్లెలూయ ||

7. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో
ఆరాధించెద నిన్ను ప్రభువా
|| హల్లెలూయ ||

యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు

“పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.” 1 తిమోతి Timothy 1:15

పల్లవి : యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి

1. నరులన్ గావన్ శ్రమల బొందెన్ క్రీస్తు ప్రభువు
తిరిగెన్ భువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్
|| యేసు క్రీస్తు ||

2. నిత్యజీవం నిత్య శాంతి నిండు నెమ్మది
నిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను
|| యేసు క్రీస్తు ||

3. భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే
భీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మళించును
|| యేసు క్రీస్తు ||

4. మరణమేలు లోయలందు సంచరించెడు
తరుణములు కలిగినను క్రీస్తు మీ చెంతనుండున్
|| యేసు క్రీస్తు ||

5. మన జీవము క్రీస్తే గదా క్రీస్తున్ తేరి చూచి
తనయులమై యుద్ధమందు జయము నొందెదము
|| యేసు క్రీస్తు || .