యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి

“యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.” కీర్తన Psalm 96:1-8

యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వ జనులారా పాడుడి మీరు

పల్లవి : యెహోవాకు పాడుడి

1. యెహోవాకు పాడి నామమును స్తుతించుడి
అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి
|| యెహోవాకు ||

2. అతి మహాత్మ్యము గలవాడు యెహోవా
అధికస్తోత్రము నొంద – తగినవాడు ఆయనే
|| యెహోవాకు ||

3. సమస్త దేవతలకన్న పూజనీయుడు
అన్య జనులలో తన – మహిమను ప్రకటించుడి
|| యెహోవాకు ||

4. సకల జనములలో నాయన ఆశ్చర్య
కార్యముల ప్రచురించి – పూజింప రండి
|| యెహోవాకు ||

5. జనముల దేవతలందరు విగ్రహములే
యెహోవా నాకాశ విశా-లములను సృజించె
|| యెహోవాకు ||

6. ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి
బల సౌందర్యము లాయన – పరిశుద్ధ స్థలమందున్నవి
|| యెహోవాకు ||

రండి యెహోవానుగూర్చి

“రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము.” కీర్తన Psalm 95:1-8

పల్లవి : రండి యెహోవానుగూర్చి
సంతోష గానము చేయుదము

1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము
కృతజ్ఞతాస్తుతుల తోడ
|| రండి ||

2. మహా దేవుడు యెహోవా – దేవతలందరి పైన
మహాత్మ్యము గల మహారాజు
|| రండి ||

3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి
పర్వత శిఖరము లాయనవే
|| రండి ||

4. సముద్రమును భూమిని – తనదు చేతులు చేసెను
తన ప్రజలము గొఱ్ఱెలము మనము
|| రండి ||

5. యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదము
మనల సృజించిన దేవునికి
|| రండి ||

6. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల
ఎంత మేలు మనోహరము

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా

“యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ” కీర్తన Psalm 92

పల్లవి : యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా
నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది

1. ఉదయము నందు నీదు కృపను
ప్రతిరాత్రిలో నీ – విశ్వాస్యతను
యెహోవా నిన్ను గూర్చి – ప్రచురించుట మంచిది
|| యెహోవాను ||

2. పదితంతులు గల – స్వరమండలమున్
గంభీర ధ్వనిగల – సితారలను
వాయించి నిన్ను గూర్చి – ప్రచురించుట మంచిది
|| యెహోవాను ||

3. ఎందుకనగా యెహోవా – నీ కార్యము చేత
నీవు నన్ను సంతోష-పరచు చున్నావు
నీ చేతిపనులను బట్టి – నేనుత్సహించుచున్నాను
|| యెహోవాను ||

4. యెహోవా నీ కార్యము – లెంత మంచివి
నీ యాలోచన లతి – గంభీరములు
పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు
|| యెహోవాను ||

5. నిత్యనాశనము – నొందుటకే గదా
భక్తిహీనులు గడ్డి – వలె చిగుర్చుదురు
చెడు కార్యములను – చేయువారు పుష్పింతురు
|| యెహోవాను ||

6. మహోన్నతుడవుగా – నిత్యముండు యెహోవా
నీ శత్రువు లెహోవా – నశియించెదరు
చెడు పనులను చేయు – వారందరు – చెడిపోదురు
|| యెహోవాను ||

7. నీతిమంతులు తమా-ల వృక్షమువలె
నాటబడినవారై – యెహోవా మందిరములో
ఎదుగుచు మొవ్వు వేసి – వర్థిల్లుచు నుండెదరు
|| యెహోవాను ||

8. నాకు ఆశ్రయమైన – యెహోవా యథార్థుడు
చెడుగు లేనివాడని – ప్రసిద్ధి చేయుటకు
సారము కలిగి ప-చ్చగ నుందురు వృద్ధులు
|| యెహోవాను ||

సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

“నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.” కీర్తన Psalm 84:1-7

సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే
సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే

పల్లవి : తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును

1. ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమును
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు
|| తన రెక్కల ||

2. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా
చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను
|| తన రెక్కల ||

3. వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు
|| తన రెక్కల ||

4. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం
అపాయము తెగులు – నీ గుడారము సమీపించవు
|| తన రెక్కల ||

5. నీదు మార్గంబులలో – నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు
|| తన రెక్కల ||

6. కొదమ సింహముల నాగుపాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను
|| తన రెక్కల ||

7. అతడు నను ప్రేమించెన్ – నామమున మొఱ్ఱపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్
|| తన రెక్కల ||

మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు

పల్లవి : మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు
సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు

1. ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడు
రక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి
|| మహోన్నతుని ||

2. తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగును
ఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది
|| మహోన్నతుని ||

3. రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనా
చీకటిలో తిరుగు తెగులునకైనా – నీవు భయపడవు
|| మహోన్నతుని ||

4. మధ్యాహ్నములో పాడుచేయు రోగమునకు భయపడవు
నీ ప్రక్కను వేయి మంది పడినను నీవు భయపడవు
|| మహోన్నతుని ||

5. నీ కుడిప్రక్కను పదివేల మంది కూలిపోయినను – నీవు భయపడవు
అపాయము నీ దాపున కేమాత్రము రాదు భయపడవు
|| మహోన్నతుని ||

6. భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము నీవు చూచెదవు
మహోన్నతునే ఆశ్రయముగా చేసి వసించు చున్నావు
|| మహోన్నతుని ||

7. నీ గుడారమున కపాయము తెగులు సమీపించదు
నీ మార్గంబులలో నిను కాపాడను దూతలకు చెప్పున్
|| మహోన్నతుని ||

8. నీ పాదములకు రాయి తగుల నీక నిన్నెత్తు కొందురు
సింహములను నాగుల భుజంగములను అణగ ద్రొక్కెదవు
|| మహోన్నతుని ||

9. నన్నెరిగి ప్రేమించె గాన నేను వాని ఘనపరతున్
నా నామమున మొఱ్ఱపెట్టగా నేను ఉత్తరమిచ్చెదను
|| మహోన్నతుని ||

10. శ్రమలో తోడై విడిపించి వాని గొప్ప చేసెదను
దీర్ఘాయువుతో తృప్తిపరచి – నా రక్షణ చూపెదను
|| మహోన్నతుని ||