యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో

“యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.” కీర్తన Psalm 145:3

పల్లవి : యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో
గ్రహింప శక్యము కానిది

1. పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను
పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి
పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్
పరశుద్ధ కార్యము ప్రకటింతుము
|| యెహోవా ||

2. మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను
మహిమను విడచి నరుడుగ జన్మించె
ఆహా సిలువలో సాతానును జయించె
బాహాటముగా రక్షణ నొసగె మనకు
|| యెహోవా ||

3. తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు
తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి
అర్పించెను ప్రాణము మంచి కాపరియై
గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను
|| యెహోవా ||

4. ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము
అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి
నాథుడేసునందు పొందితిమి వెలుగు
అధికమైన జ్ఞాన మహిమలొసగె
|| యెహోవా ||

5. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము
పాప ఫలితము మరణము సహింతువా?
పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే
తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును
|| యెహోవా ||

6. ప్రధానుల కంటెను అధికారులకన్న
అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును
అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు
అందరం పాడెదము హల్లెలూయా పాట
|| యెహోవా ||

స్తుతియింతుము – స్తోత్రింతుము

“మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.” ఎఫెసీ Ephesians 1:3-9

పల్లవి : స్తుతియింతుము – స్తోత్రింతుము
పావనుడగు మా – పరమ తండ్రిని

1. నీ నామము ఋజువాయే – నీ ప్రజలలో దేవా
వర్ణింప మా తరమా – మహిమ గలిగిన నీ నామమును
|| స్తుతియింతుము ||

2. మా ప్రభువా మా కొరకై – సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై – రక్తమును కార్చిన రక్షకుడా
|| స్తుతియింతుము ||

3. మా ప్రభువైన యేసుని – పరిశుద్ధాత్మ ప్రియుని
ప్రియమగు కాపరులన్ – ప్రియమార మా కొసగిన తండ్రి
|| స్తుతియింతుము ||

4. పరిశుద్ధ జనముగా – నిర్దోష ప్రజలనుగా
పరలోక తనయులుగా – పరమ కృపతో మార్చిన దేవా
|| స్తుతియింతుము ||

5. సంపూర్ణ జ్ఞానమును – పూర్ణ వివేచనమును
పరిపూర్ణంబుగ కలుగ – పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి
|| స్తుతియింతుము ||

6. ప్రభు యేసు క్రీస్తులో – పరలోక విషయములో
ప్రతియాశీర్వాదములన్ – ప్రాపుగ నొసగిన పరమ తండ్రి
|| స్తుతియింతుము ||

7. ఎల్లరిలో జీవజలం – కొల్లగ పారునట్లు
జీవంబు నిచ్చితివి – జీవాధిపతి హల్లెలూయ
|| స్తుతియింతుము ||