యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట

1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతి
ముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును
|| యేసు ప్రభూ ||

2. మరణపులోయ ద్వారా – సరిగా నడిపించును
అడవి భయములెల్ల – ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా – లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో – సంతోషింతును
|| యేసు ప్రభూ ||

3. శత్రుల ముందాహారం – సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి – పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి – ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున – జయమున వెళ్ళెదను
|| యేసు ప్రభూ ||

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్

1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్
|| యెహోవా ||

2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము
|| యెహోవా ||

3. నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

4. చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసముగా నుందున్
|| యెహోవా ||

నీవే యెహోవా నా కాపరివి

“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23

పల్లవి : నీవే యెహోవా నా కాపరివి
నాకేమి కొదువ లేదిలలోన

1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
నా ప్రాణమునకు సేదను దీర్చి
నన్ను నడుపుము నీతిమార్గమున
|| నీవే యెహోవా ||

2. గాఢాంధకార లోయలయందు
పడియుండి నేను సంచరించినను
తోడైయుందువు నీ దుడ్డుకర్ర
దండముతో నీ వాదరించెదవు
|| నీవే యెహోవా ||

3. శత్రువుల యెదుట నీవు నాకు
నిత్యమగు విందు సిద్ధపరచి
నాతల నూనెతో నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| నీవే యెహోవా ||

4. నిశ్చయముగా కృపాక్షేమములే
వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
చిరకాలము యెహోవా మందిరమున
స్థిరముగా నే నివసించెదను
|| నీవే యెహోవా ||

యెహోవా నా కాపరి – లేమి కలుగదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదు
పచ్చికలపై పరుండజేయుచున్నాడు

1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల
చెంత నన్నడిపించుచున్నాడు
|| యెహోవా ||

2. సర్వదా నాదు ప్రాణంబునకు
సేద దీర్చుచున్నాడు యెహోవా
|| యెహోవా ||

3. తన నామమును బట్టి నీతి మార్గములో
నన్ను చక్కగా నడుపుచున్నాడు
|| యెహోవా ||

4. చీకటి లోయలో నే తిరిగినను
ఎట్టి అపాయమునకు భయపడను
|| యెహోవా ||

5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న
న్నాదరించి తోడై యుందువు
|| యెహోవా ||

6.నా శత్రువుల యెదుట నీవు నాకు
భోజనము సిద్ధపరచుదువు
|| యెహోవా ||

7. నూనెతో నా తల నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము
నిత్యమెహోవా మందిరములో నుండెద
|| యెహోవా ||

నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యా

“నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.” కీర్తన Psalm 22:1-10

పల్లవి : నాదు దేవా నాదు దేవా – నన్నేల విడనాడితివయ్యా

అనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని – వినక నీవేల దూరమున్నావు?
1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా – ఏల నుత్తరమీయకున్నావు
ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న – పరిశుద్ధ దేవుడవై యున్నావు
|| నాదు దేవా ||

2. మా పితరులు నీయందు – విశ్వసించగా రక్షించితివి
మొఱలిడి నిన్ను నమ్మిరి – విడుదలొంది సిగ్గునొందలేదు
|| నాదు దేవా ||

3. నరుడను కాను పురుగును – నరులచే నిందింపబడితి
నరులచే తృణీకారము – పొందియున్న వాడనైతిని
|| నాదు దేవా ||

4. నన్ను జూచు వారెల్లరు – తమ పెదవులను విరిచి
తలల నాడించుచున్నారు – నన్నపహసించుచున్నారు
|| నాదు దేవా ||

5. యెహోవాపై భారముంచుము – తాను నిన్ను విడిపించునేమో
వాడాయన కిష్టుడు కాడా – వాని తప్పించునేమో యందురు
|| నాదు దేవా ||

6.గర్భమునుండి నన్ దీసిన వాడా – నా తల్లి యొద్ద స్తన్యపానము
చేయుచుండగా నీవే కాదా – నాకు నమ్మిక పుట్టించితివి
|| నాదు దేవా ||

7. గర్భవాసినైనది మొదలు – నుండి నా కాధారము నీవే
నన్ను దల్లి కనిన నాటి – నుండి నా దేవుడవు నీవే
|| నాదు దేవా ||