పావనుడా మా ప్రభువా

“అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండెను.” యెషయా Isaiah 6:1

పల్లవి : పావనుడా మా ప్రభువా – నీ రక్షణకై స్తోత్రములు
నీ రక్షణకై స్తోత్రములు

1. అత్యున్నతమైన దేవా – సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ – వర్ణింపజాలను నేను
|| పావనుడా ||

2. పాపపు కుష్ఠుతో పడి చెడిన – ఈపాపిని కరుణించితివి
నా పాపపు డాగులు కడిగి – పరిశుద్ధుని చేసిన విభుడా
|| పావనుడా ||

3. అపవిత్రమగు పెదవులతో – కపటముగా జీవించితిని
అపరాధి నోటిని తెరచి – స్తుతి గీతము నొసగిన ప్రభువా
|| పావనుడా ||

4. నీ క్రయధన మధికము ఎంతో – నా కర్త నిను ప్రణుతింతు
నా కందరి కంటె ఘనుడా – ఓ కల్వరి నాథా యేసు
|| పావనుడా ||

5. మహిమ పరతును ప్రభు యేసు – మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను – మహిమలో ఆరాధించెదను
|| పావనుడా ||

6. నా కనులతో నిను చూచెదను – ఆకసమున దూతల మధ్య
రక్షక త్వరగా రారమ్ము – అక్షయుడా నీకే స్తుతులు
|| పావనుడా ||

ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి

“నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.” గలతీ Galatians 2:20

పల్లవి : ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై

1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై – స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ
|| ప్రభుయేసు ||

2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ – కరుణించి నా స్థితిని జూచి
కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ – కడు వేదనతో యేడ్చితివి
|| ప్రభుయేసు ||

3. కొరడా దెబ్బలచే నీ దేహమంత – చారలుగ దున్నబడెను
శరీరమంత రక్తమయమాయెను – వరదా! గాయము లొందితివా
|| ప్రభుయేసు ||

4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి – బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను – ఓర్చితివా మౌనము వహించి
|| ప్రభుయేసు ||

5. ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై – పాపము నుండి విడిపించుటకు
పొందితి నెంతో గొప్ప రక్షణను – పశ్చాత్తాపము ద్వారా నేను
|| ప్రభుయేసు ||

6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ – ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే – పొందుగ నీ వాడనైతి
|| ప్రభుయేసు ||

7. నా యెడల నీదు సంకల్పమేగా – నీ స్వాస్థ్య మనుభవించుటకు
నీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి
|| ప్రభుయేసు ||