సృష్టికర్తవైన యెహోవా

సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ            ||సృష్టికర్తవైన||

ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)           ||సృష్టికర్తవైన||

నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2)           ||సృష్టికర్తవైన||

దయగల హృదయుడవు

దయగల హృదయుడవు
నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి
నిన్ను కొనియాడును

“దయగల”

1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2

2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2

3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా!
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా

1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే
ఉన్నతముగ నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి
నూతన వసంతములో చేర్చును
జీవించెద నీ కొరకే – హర్షించెద నీ లోనే

2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశా నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగ నను చేసెను
నా స్తుతి కీర్తన నీవే – స్తుతి ఆరాధన నీకే

3 నిజ స్నేహితుడా! నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీతోనే – నా కలిమి నీలోనే

ఆర్భాటముతో ప్రధాన దూత

ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో

మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు

1.అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము

అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు

ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే

2.పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము

సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు

గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము

3.వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము

ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో

యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము

నీ బాహుబలము ఎన్నడైన

నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా

నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా

నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి

యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ


1.ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి

దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి

అవమానించినవారే అభిమానమును పంచగా

ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం


2.సారవంతమైన తోటలో నను నాటితివి

సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి

చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై

ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును


3.వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ

పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు

శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు

గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును