వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు

“నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు” ప్రకటన Revelation 4:11

పల్లవి : వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే
నన్నేలెడు ప్రభు నా రాజాయనే
యుగుయుగ మహిమ ప్రభువునకే
పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్
|| వందనము ||

2. నా ఆదర్శము మహిమయు తానే
తన యధికారము సర్వము నేలును
తన నామము బహు అద్భుతము
|| వందనము ||

3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు
భక్తుల స్మరణ నీతియు నాయనే
మహాప్రభావము గలవాడు
|| వందనము ||

4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే
తన నీతి బహు ఉన్నతమైనది
సైన్యముల కధిపతి నా తోడు
|| వందనము ||

ప్రభువా నీ గొప్పతనము – స్తుతికి యోగ్యము

“యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు.” కీర్తన Psalm 145:3

పల్లవి : ప్రభువా నీ గొప్పతనము – స్తుతికి యోగ్యము
అశక్యమైనది – వర్ణించలేమిల
1. సృష్టి గొప్పది అద్భుతమేగా – సంకల్పమెంతో వుత్తమము
మానవజాతి కొరకై ప్రభూ – సిద్దపరచె సమస్తము
నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||

2. నీ రూపమున నరుని సృజించి – అధికారము నిచ్చితివి
క్రీస్తునందు నిర్దోషినిగా – నిలువబెట్ట గోరితివి
నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల
|| ప్రభువా ||

3. సృష్టిని చేసిన శక్తికంటె – పాపికి రక్షణ గొప్పది
నీ యొద్ద నున్న సర్వమిచ్చి – విలువగు ముత్యము కొన్నావు
నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల
|| ప్రభువా ||

4. నీకు మానవుడమూల్యము – నీవు ప్రేమించుచున్నావు
అందుకే నీ ప్రాణమర్పించి – రక్తము కార్చి రక్షించితివి
నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల
|| ప్రభువా ||

5. అద్భుతమైన నూతన సృష్టి – మానవునికి నిచ్చితివి
రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల
|| ప్రభువా ||

6. ఉల్లాసముతో సృష్టి మైమరచే – అద్భుత కార్యములను చూచి
సంతోషించి ఆరాధించిరి – నీవే సర్వమని చెప్పిరి
నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||