విశ్వాసము లేకుండా దేవునికి

విశ్వాసము లేకుండా దేవునికి 
ఇష్టులైయుండుట అసాధ్యము 
విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు .......... 

హానోకు తన మరణము చూడకుండ 
పరమునకు ఎత్తబడి పోయెనుగా 
ఎత్తబడక మునుపే దేవునికి 
ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || 

నోవహు దైవభయము గలవాడై 
దేవునిచే హెచ్చరించబడిన వాడై 
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి 
నీతికే వారసుడని సాక్ష్యమొందెను    || విశ్వా || 

మోషే దేవుని బహుమానము కొరకై 
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి 
శ్రమలనుభవించుటయే భాగ్యమని 
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను   || విశ్వా || 

వీరందరు సాక్ష్యము పొందియున్నను 
మనము లేకుండా సంపూర్ణులు కారు 
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో 
మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వా ||

మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు (2)
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన||

నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||