నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

“యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.” కీర్తన Psalm 36:5

పల్లవి : నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను

1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మనుజావళికి
నిబంధనను స్థిరముగ జేసి
నిరతము నలరారెడు మా ప్రభువా
|| నీదు విశ్వాస్యత ||

2. వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగుదేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరి
|| నీదు విశ్వాస్యత ||

3. నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధుర ప్రేమ
|| నీదు విశ్వాస్యత ||

4. ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో
|| నీదు విశ్వాస్యత ||

5. మన ఆత్మనుజీవము దేహమును
మన ప్రభుయేసు రాకడవరకు
వొసరుగ కాపాడును పదిలముగా
దిన దినమును నిందారహితముగ
|| నీదు విశ్వాస్యత ||

6. తండ్రికుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో
|| నీదు విశ్వాస్యత ||

రుచిచూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు

“యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి” కీర్తన Psalm 34:8

పల్లవి : రుచిచూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని

1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే
|| రుచిచూచి ||

2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనస్సార పొగడదను నీ ఆశ్చర్య కార్యములన్
|| రుచిచూచి ||

3. మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు
|| రుచిచూచి ||

4. నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్
|| రుచిచూచి ||

5. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు
|| రుచిచూచి ||

6. ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని
|| రుచిచూచి ||

7. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను
|| రుచిచూచి ||

ఆరాధించెద నిను మది పొగడెద

“ఇల్లు అత్తరు వాసనతో నిండెను.” యోహాను John 12:3

పల్లవి : ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రభువా

1. విస్తారంబగు – వ్యాపకములలో – విడచితి నీ సహవాసమును
సరిదిద్దితివి నా జీవితము – నిను సేవింపగా నేర్పిన ప్రభువా
|| ఆరాధించెద ||

2. నా జీవితమున నీ మాటలను – వినుటయే చాలని యెరిగితిని
నా కన్నీటితో నీ పాదములను – కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా
|| ఆరాధించెద ||

3. వ్యర్థపరచితిని నా సర్వమును – స్వార్థముతో జీవించితిని
గుర్తించితిని నీ త్యాగమును – వినయముతో నీ సన్నిధిచేరి
|| ఆరాధించెద ||

4. నీరక్తముతో నన్ను కడిగితివి – పరిశుద్ధునిగా జేసితివి
నీరక్షణకై స్తోత్రము చేయుచు – నిత్యమునిన్ను కొనియాడెదను
|| ఆరాధించెద ||

5. దుర్గంధముతో నిండిన నన్ను – దయతో నీవు పిలిచితివి
ప్రేమతో పరమ విందు నొసంగి – ఆనందింపగ జేసిన ప్రభువా
|| ఆరాధించెద ||

6. ప్రియముగ దాచిన అత్తరు భరణి – పగులగొట్టి నిన్ను పూజింతు
నీ ప్రేమను నే నెన్నగ తరమా – నా జీవితమున చాలిన ప్రభువా
|| ఆరాధించెద ||

7. పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు – నీ సన్నిధిలో నిలచినను
లెక్కింపగ జాలని జనమందున – ననుగుర్తింతువు నా ప్రియ ప్రభువా
|| ఆరాధించెద ||

ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా

“ప్రేమ మరణమంత బలవంతమైనది. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు.” పరమగీతము Song Of Songs 8:6,7

పల్లవి : ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా

1. నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె
నిక్కముగ ఋజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే
|| ప్రేమగల ||

2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను
అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను
|| ప్రేమగల ||

3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను
|| ప్రేమగల ||

4. తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు
తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే
|| ప్రేమగల ||

5. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా
వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను
|| ప్రేమగల ||

ఓ ప్రభువా యిది నీ కృపయే

“దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి … అపరాధములకు క్షమాపణ మనకు కలిగెను.” ఎఫెసీ Ephesians 1:7

పల్లవి : ఓ ప్రభువా యిది నీ కృపయే – గొప్ప క్రయము ద్వారా కలిగె

1. కృపద్వారానే పాపక్షమాపణ – రక్తము ద్వారానే కలిగె
అపరాధముల నుండి విమోచన – యేసులో మనకు ప్రాప్తించె
|| ఓ ప్రభువా ||

2. కృపద్వారానే కలిగిన రక్షణ – మానవులొసగ జాలరిల
క్రియలద్వారా కలుగలేదు – యేసు ప్రభుని వరమిదియే
|| ఓ ప్రభువా ||

3. కృపతో మనల పిలిచెను ప్రభువు – పరిశుద్ద పిలుపుద్వారా
అపరిమిత సంకల్పమువలన – మనమెరిగితిమి ఈ ధరలో
|| ఓ ప్రభువా ||

4. కృపద్వారానే నీతి మంతులుగా – తీర్చెను మనల ఉచితముగ
అపాత్రులమైయున్న మనకు – ప్రాయశ్చిత్తము కలిగెనుగ
|| ఓ ప్రభువా ||

5. కృపయే మనకు బయలు పడెను – సమస్తమును భోధించును
అపవిత్ర క్రియలన్నియు విడచి – భయభక్తులతో బ్రతికెదము
|| ఓ ప్రభువా ||

6. కృపద్వారానే బలవంతులమై – ఎదురుకొనెదము యుద్ధమును
ప్రభువునందు అంత మువరకు – స్థిరముగ ముందుకుసాగెదము
|| ఓ ప్రభువా ||

7. కృపద్వారానే సమీపించితిమి – దానియందే నిలిచితిమి
క్రీస్తు మహిమ నిరీక్షణకై – ఆయనకే స్తుతి పాడెదము
|| ఓ ప్రభువా ||