అనుదినము మా భారము – భరించే దేవా

“ప్రభువు స్తుతినొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.” కీర్తన Psalm 68:19

పల్లవి : అనుదినము మా భారము – భరించే దేవా
అనిశము నీ మేళ్ళతో – నింపుచున్నావు

1. సన్నుతించు మనిశము – నా ప్రాణమా యేసుని
పరిశుద్ధ నామమును – పొగడు మెప్పుడు
ఒంటె బరువు దీవెనలు – వీపున మోసె
|| అనుదినము ||

2. నా శరీరమున ముల్లు – బాధపరచుచుండగా
వేదనతో వేడగా – ధైర్యమిచ్చితివి
నా కృప నీ కెల్లప్పుడు – చాలునంటివి
|| అనుదినము ||

3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా
నీ రక్తముచే మమ్ము – విమోచించితివి
నీదు కృపా మహదై-శ్వర్యంబును బట్టి
|| అనుదినము ||

4. అన్నిటిలో నెప్పుడు – సకల సంపదలతోను
సమృద్ధితో మమ్ములను – సాకుచుంటివి
కృపా క్షేమములను మాపై – కుమ్మరించితివి
|| అనుదినము ||

5. సర్వవేళల సంతృప్తిని – నేర్పినావు మాకిల
సకలంబును చేయుటకు – శక్తి నిచ్చితివి
బలపరచుము నిన్ను బట్టి – బలుడవు దేవా
|| అనుదినము ||

భజియింప రండి ప్రభుయేసుని

“యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది.” యోహాను John 4:23

పల్లవి : భజియింప రండి ప్రభుయేసుని
ఆత్మసత్యములతో ప్రేమామయుని పరమ తండ్రిని

1. పాప క్షమాపణ మనకిచ్చెను
మనల విమోచించె రక్తముతో
జయము జయము మన ప్రభుకే
|| భజియింప ||

2. ఆత్మమందిర ప్రత్యక్షత నొసగెన్
నేత్రము తెరచెను యేసుని చూడ
ఆశ్చర్యకరుడు సదాకాలము
|| భజియింప ||

3. ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె
స్వాస్థ్యము పొంద వారసులమైతిమి
హోసన్న హోసన్న విజయునికే
|| భజియింప ||

4. జగమును జయించే జీవితమునిచ్చె
సిలువ శక్తిచే మనలను గాచెగా
స్తుతులర్పింతుము ముక్తిదాతకే
|| భజియింప ||

5. సంఘము ప్రభుని చేర తేరిచూచెగా
సదాకాల మాయనతో నుండ నెప్పుడు
సాగిలపడెదము సృష్ఠికర్తకే
|| భజియింప ||

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము

“దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.” కీర్తన Psalm 66:16

పల్లవి : స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను

1. పాపలోక బంధమందు దాసత్వమందుండ
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి
|| స్తుతి ||

2. పాప భారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
|| స్తుతి ||

3. హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె
|| స్తుతి ||

4. పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
|| స్తుతి ||

కృపగల దేవుని కొనియాడెదము

“నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను.” 1 కొరింథీ Corinthians 15:10

పల్లవి : కృపగల దేవుని కొనియాడెదము
కృపచాలు నీకనే ప్రభుయేసు

1. పాపములెన్నియో చేసినవారము
నెపములెంచక తన ప్రాణమిడె
కృపద్వారానే రక్షించె మనల
|| కృపగల ||

2. కృపయు సత్యమును యేసు ద్వారనే
కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
కృపతోడనే గాచును మనల
|| కృపగల ||

3. సర్వకృపానిధియగు మన దేవుడు
పరిపూర్ణత నిచ్చి బలపరచును
స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి
|| కృపగల ||

4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్
సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
సర్వము మీవని బోధించె
|| కృపగల ||

5. శ్రమయైనను సిలువ బాధైనను
శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో
క్రమముగా కృపచే సాగెదము
|| కృపగల ||

6. ఇక జీవించువాడను నేను కాను
ఇక జీవించుట నా ప్రభు కొరకే
సకలంబు ప్రభున కర్పింతున్
|| కృపగల ||

7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయే
నన్ను నడిపించును ప్రభువు సదా
పెన్నుగా నేర్పును హల్లెలూయ
|| కృపగల ||

యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో

“యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.” కీర్తన Psalm 145:3

పల్లవి : యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో
గ్రహింప శక్యము కానిది

1. పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను
పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి
పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్
పరశుద్ధ కార్యము ప్రకటింతుము
|| యెహోవా ||

2. మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను
మహిమను విడచి నరుడుగ జన్మించె
ఆహా సిలువలో సాతానును జయించె
బాహాటముగా రక్షణ నొసగె మనకు
|| యెహోవా ||

3. తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు
తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి
అర్పించెను ప్రాణము మంచి కాపరియై
గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను
|| యెహోవా ||

4. ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము
అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి
నాథుడేసునందు పొందితిమి వెలుగు
అధికమైన జ్ఞాన మహిమలొసగె
|| యెహోవా ||

5. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము
పాప ఫలితము మరణము సహింతువా?
పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే
తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును
|| యెహోవా ||

6. ప్రధానుల కంటెను అధికారులకన్న
అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును
అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు
అందరం పాడెదము హల్లెలూయా పాట
|| యెహోవా ||