యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్

1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్
|| యెహోవా ||

2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము
|| యెహోవా ||

3. నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

4. చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసముగా నుందున్
|| యెహోవా ||

నీవే యెహోవా నా కాపరివి

“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23

పల్లవి : నీవే యెహోవా నా కాపరివి
నాకేమి కొదువ లేదిలలోన

1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
నా ప్రాణమునకు సేదను దీర్చి
నన్ను నడుపుము నీతిమార్గమున
|| నీవే యెహోవా ||

2. గాఢాంధకార లోయలయందు
పడియుండి నేను సంచరించినను
తోడైయుందువు నీ దుడ్డుకర్ర
దండముతో నీ వాదరించెదవు
|| నీవే యెహోవా ||

3. శత్రువుల యెదుట నీవు నాకు
నిత్యమగు విందు సిద్ధపరచి
నాతల నూనెతో నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| నీవే యెహోవా ||

4. నిశ్చయముగా కృపాక్షేమములే
వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
చిరకాలము యెహోవా మందిరమున
స్థిరముగా నే నివసించెదను
|| నీవే యెహోవా ||