ఆనందముతో – ఆరాధింతున్

“ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను” యోహాను John 4:24

పల్లవి : ఆనందముతో – ఆరాధింతున్ ఆత్మతోను – సత్యముతో
అనుపల్లవి : రక్షణ పాత్ర నేనెత్తుకొని – స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును – యేసుని నామమును

1. పాపినైన నన్ను రక్షింపను – సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను – మృత్యుంజయుడై లేచెను
|| ఆనందముతో ||

2. మరణపుటురులలో నేనుండగా – నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను – మరణపు ముల్లు విరచెను
|| ఆనందముతో ||

3. శత్రుని ఉరి నుండి విడిపింపను – శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను – క్రీస్తునందు నను దాచెను
|| ఆనందముతో ||

4. పరలోక పౌరసత్వం నా కివ్వను – పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను – తన ప్రాణమర్పించెను
|| ఆనందముతో ||

5. శోధన వేదన బాధలెన్నో – ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను – అర్పించుకొందు నీకు
|| ఆనందముతో ||

6. అంగీకరించు – నా జీవితమును – నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ – హల్లెలూయ ఆమెన్ – హల్లెలూయ
|| ఆనందముతో ||

యేసు నీకే జయం జయము

“ఈయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాను” యోహాను John 4:42

పల్లవి: యేసు నీకే జయం జయము (2)
నీవె లోక పాల – కుడవు (2)
సర్వ సృష్టికి సృష్టి – కర్తవు
సర్వలోక రక్ష – కుడవు
జై జై అనుచు నీ – కే పాడెదం (2)

1. జన్మించె జగమున మా – నవ రూపములో
ప్రాయశ్చిత్తము – కై – తా – నె బలియాయె
పాపియైన మా – న – వుని రక్షింప
శిలువ నెక్కి తన ప్రా-ణము నిచ్చెన్
హల్లెలూయా భువిపైన (2)

2. మరణము ద్వారా – అంతమాయె బలులు
-త-న స-మా-ధి, సర్వం కప్పెన్
తిరిగి లే-చుటచే, సర్వం నూతనమాయె
సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి
హల్లెలూయా భువిపైన (2)

3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్
తండ్రి కుడిప్రక్కన, ఆ-యన కూర్చుండెన్
రాజుల రాజై, ప్రభువుల ప్రభువై
పొందె అధికారము – పరలోకముపై
హల్లెలూయా భువిపైన (2)

4. తన రూపమునకు మార్పు, నిష్ట-మాయె
సృష్టికంటె ముందు తానె సంకల్పించె
లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని
తన రూపము నొంది – తనతో-నుండెదం
హల్లెలూయా భువిపైన (2)

నీ మందిరము అతిశృంగారము

“పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలది” ప్రకటన Revelation 21:10

పల్లవి : నీ మందిరము అతిశృంగారము – నీ ప్రజలందరికి
మహిమ తేజస్సు మెండుగ నింపి – నూతన పరచు దేవ – 2

1. నీ రక్తము చిందించి – నూతన జన్మము నిచ్చి – 2
స్వాస్థ్యముగ మమ్ముజేసి – నీ మందిరమున నిలిపి – 2
కొదువలయందు కృపచూపించి – తృప్తిగ పోషించితివి – 2
మహిమ … మహిమ … మహిమ … నీకె – 2
|| నీ మందిరము ||

2. నీ మందిరములో నిత్యము – వసియించి వర్ధిల్లెదము
అనుదినము స్తుతియించి – నూతన బలమును పొంది
అన్నిటియందు దీవించబడి – ధన్యులుగా నుండెదము
మహిమ … మహిమ … మహిమ … నీకె
|| నీ మందిరము ||

3. నీ మందిరములో దొరుకున్ – నిత్యానందము నిరతం
శోధన శ్రమల యందు – కదలక స్థిరముగ నిలచు
అంతము లేని అద్భుతమైన – ఆదరణ పొందెదము
మహిమ … మహిమ … మహిమ … నీకె
|| నీ మందిరము ||

4. కోల్పోతిమి నీ మహిమను – మా అతిక్రమముల వలన
క్షమియించి నింపుము దేవ – మహాప్రభావ మహిమను
మునుపటి మహిమను మించిన మహిమతో – నిండుగ నింపుము దేవ
మహిమ … మహిమ … మహిమ … నీకె
|| నీ మందిరము ||

5. అంతము వరకు మమ్ము – సజీవ రాళ్ళవలె నుంచి
కట్టుము ఆత్మ మందిరము – నింపుము అధిక మహిమను
యుగయుగములకు ఘనత మహిమ – నీకు కలుగును గాక
మహిమ … మహిమ … మహిమ … నీకె
|| నీ మందిరము ||

నా ప్రియుడా – పాపవిమోచకుడా

“ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగియున్నది” ఎఫెసీ Ephesians 1:7

పల్లవి : నా ప్రియుడా – పాపవిమోచకుడా – ప్రభుయేసు (2)
నా ప్రాణమును కాపాడి – నూతన బలమొసగెను (2)
స్తుతి గీతములతో – ఆరాధించెదను – ఎల్లప్పుడు (2)

1. యేసుని రక్తమందు – ముక్తి లభించెను – స్తుతించెదన్
యేసుని నిత్య జీవము – పొందెదను నిశ్చయం
యేసునకె నా స్తుతి సుమములు – సుమధురం
|| నా ప్రియుడా ||

2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను – ప్రేమించెన్
తల్లిని మించిన ప్రేమ – జూపిన మరువని ప్రేమ
తల్లి మరిచిన మరువ డేసు – నిరతము
|| నా ప్రియుడా ||

3. సూర్యకాంత సుగంధ సునీల – సువర్ణము
సూర్యతేజస్సు మించిన – ఆ వెల్గు రాజ్యములో
సూర్యునివలె తేజరిల్లెదను – నా యేసుతో
|| నా ప్రియుడా ||

4. బూరశబ్దముతో నీవరుదెంచు – దూతలతో
నాకై గాయపడిన – బంగారు నీ మోమున్
రక్షణతో నిరీక్షించెదన్ – వీక్షింపన్
|| నా ప్రియుడా ||

5. సూర్యచంద్ర ఆకాశం దాటి – నీ చెంతకు
జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
హల్లెలూయ హల్లెలూయ – ఎల్లప్పుడు
|| నా ప్రియుడా ||

తంబుర సితారతో – మా ప్రభుని ఆరాధించెదము

“సితారతోను … తంబురతోను ఆయనను స్తుతించుడి” కీర్తన Psalm 150:3-4

పల్లవి : తంబుర సితారతో – మా ప్రభుని ఆరాధించెదము
తన నివాసముగ – మమ్ము సృష్టించిన
నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము

1. ఆది ఆదాము – మరణ శాసనము
మా శరీరమున్ – ఏలుచుండగా
అమరుడవై ప్రభూ – భువికేతెంచి
మరణపు ముల్లు విరిచి – మరణమున్
గెలిచిన మా ప్రభువా – 2
|| తంబుర ||

2. పాపము నుండి – చీకటి నుండి
ఆశ్చర్యకరమగు – వెలుగులో నడిపి
తన ఆలయముగ చేసిన ప్రభుకు
స్తుతి మహిమ – ఘనత
సీయోనులో అర్పించెదమెప్పుడు
|| తంబుర ||

3. పరలోక పిలుపుతో – ప్రభు మమ్ము పిలచి
నరకపు శిక్ష – తొలగించె మానుండి
పరిశుద్ధులతో – మమ్ము చేర్చిన ప్రభూ
నిర్మించెను యిలలో – గృహముగా
తన ఆత్మ ద్వారా
|| తంబుర ||

4. ఆత్మీయ యింటికి – క్రీస్తే పునాది
సజీవమైన రాళ్ళే ప్రజలు
ఆత్మీయ గృహముకు – ప్రభువే శిల్పి
ఆద్యంతరహితుడై – నడుపును
మోక్షపురికి మమ్ము
|| తంబుర ||

5. మన్నయినది – వెనుకటివలెనే
మరల భూమికి తప్పక చేరున్
మానవ సంపద – కీర్తి మహిమలు
గతించి పోవునిల సీయోను
మరువకు నీ ప్రభుని
|| తంబుర ||

6. లెబానోను వీడి – నాతోరమ్ము
లోకపు ఆశలు గతించిపోవును
హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు
హెబ్రోను చేరుదము
ప్రభువును ఆరాధించెదము
|| తంబుర ||