ఆశ్చర్యకరుడ వీవే – యెహోవా నీవే ధన్యుడవు

“యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది.” కీర్తన Psalm 36:10

పల్లవి : ఆశ్చర్యకరుడ వీవే – యెహోవా నీవే ధన్యుడవు

1. నీ కృప నింగినంటెను
వచ్చినవారే దయ పొందెదరు – నీవే దయాళుడవు
|| ఆశ్చర్యకరుడ ||

2. నీ విశ్వాస్యత గొప్పది
ఉన్నతమైనది అందరి యెడల – ఎన్నడు మారనిది
|| ఆశ్చర్యకరుడ ||

3. నీ నీతి స్థిరమైనది
పరిశీలించెదవు యెల్ల ప్రజలను – సరిదిద్దువాడ వీవే
|| ఆశ్చర్యకరుడ ||

4. అమూల్యము నీ కరుణ
వచ్చినవారికి ఆశ్రయమిచ్చి – రెక్కలతో కప్పెదవు
|| ఆశ్చర్యకరుడ ||

5. నీ యింట తృప్తిగలదు
ఆనంద జలములను త్రాగనిచ్చెదవు – నీ ప్రజలందరికి
|| ఆశ్చర్యకరుడ ||

6. నీ ప్రకాశము నిలుచు
నిన్నెరిగియున్న వారిపై నిరతం – మెండైన కృపనిత్తువు
|| ఆశ్చర్యకరుడ ||

దేవునికే మహిమ

“ఆ పట్టణము … శుద్ధ సువర్ణముగా వున్నది” ప్రకటన Revelation 21:18

పల్లవి : దేవునికే మహిమ (2)
యుగయుగములకు కలుగును గాక (2)
దేవునికే మహిమ (2)

1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో
దానికి మనలను వారసుల జేసెను
వందనములను చెల్లింతము
|| దేవునికే ||

2. నిలవరమైనది మనకిల లేదని
వల్లభుడు స్థిరపరచెను పరమందు
చెల్లించి స్తుతులను పూజింతుము
|| దేవునికే ||

3. సీయోను పురమగు దేవుని నగరుకు
సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే
స్తోత్రగీతములను పాడెదము
|| దేవునికే ||

4. పరదేశులుగా మనలను చేయక
ప్రభుని యింటికి వారసులుగ జేసె
పాడి పొగడెదము మన ప్రభుని
|| దేవునికే ||

5. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన
ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను
ముదమారగను ప్రణుతింతుము
|| దేవునికే ||

సన్నుతించెదను ఎల్లప్పుడు

“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” కీర్తన Psalm 34:1

పల్లవి : సన్నుతించెదను ఎల్లప్పుడు
నిత్యము ఆయన కీర్తి నానోటనుండు

1. యెహోయాకు ప్రార్ధించగా – నా భయమంత తొలగించెను
శ్రమలన్నిటిలో నాతో నుండి – 2
చేరదీసి నన్ను ఆదరించె – ఆరాధించెద నెల్లప్పుడు
|| సన్నుతించెదను ||

2. జీవితమంతా పాడుచుందును – నీ మేలులకు ఓ ప్రభువా
నా ఆయుష్కాల మంతయును – 2
నీ విశ్వాస్యత కొరకెప్పుడు – నిరతము నిన్ను స్తోత్రింతు
|| సన్నుతించెదను ||

3. మహోన్నతమైనది నీదు మహిమ – ఘనత ప్రభావముగల ప్రభువా
తనివి తీరగ నిను పూజింతు – 2
తరగని నీ కార్యములకై – తప్పక నిన్ను స్తుతియింతు
|| సన్నుతించెదను ||

4. నీ సంకల్పమును నెరవేర్చి – నడిపించితివి ఘనముగను
నాకు ప్రభుడవై నా కాపరివై – 2
నా జీవితములో వున్నావు – నిజముగ నిన్ను పొగడెదను
|| సన్నుతించెదను ||

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

“యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.” కీర్తన Psalm 36:5

పల్లవి : నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను

1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మనుజావళికి
నిబంధనను స్థిరముగ జేసి
నిరతము నలరారెడు మా ప్రభువా
|| నీదు విశ్వాస్యత ||

2. వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగుదేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరి
|| నీదు విశ్వాస్యత ||

3. నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధుర ప్రేమ
|| నీదు విశ్వాస్యత ||

4. ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో
|| నీదు విశ్వాస్యత ||

5. మన ఆత్మనుజీవము దేహమును
మన ప్రభుయేసు రాకడవరకు
వొసరుగ కాపాడును పదిలముగా
దిన దినమును నిందారహితముగ
|| నీదు విశ్వాస్యత ||

6. తండ్రికుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో
|| నీదు విశ్వాస్యత ||

రుచిచూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు

“యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి” కీర్తన Psalm 34:8

పల్లవి : రుచిచూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని

1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే
|| రుచిచూచి ||

2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనస్సార పొగడదను నీ ఆశ్చర్య కార్యములన్
|| రుచిచూచి ||

3. మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు
|| రుచిచూచి ||

4. నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్
|| రుచిచూచి ||

5. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు
|| రుచిచూచి ||

6. ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని
|| రుచిచూచి ||

7. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను
|| రుచిచూచి ||