మధుర మధురము యేసు నామం

“నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము.” పరమగీతము Song Of Songs 1:2

పల్లవి : మధుర మధురము యేసు నామం ….2
స్తుతికి యోగ్యము ప్రభుని నామం …. 2
మధుర మధురము యేసు నామం – మధుర మేసుని నామం

1. స్వర్గము వీడి – జగమున కరిగి
సిలువలో రక్తము – చిందించెను
|| మధుర ||

2. సిలువపై సైతానును ఓడించి
తొలగించెను నరక శిక్షను
|| మధుర ||

3. పాపులకు విమోచన మొసగి
నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్
|| మధుర ||

4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్
దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్
|| మధుర ||

5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్
దేవుని మందిరముగ నిర్మించెన్
|| మధుర ||

దేవదేవుని కొనియాడెదము

“దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును.” కీర్తన Psalm 136:2

పల్లవి : దేవదేవుని కొనియాడెదము – అవిరత త్రియేకుని స్తోత్రింతుము

అనుపల్లవి : ఏపుగా దయాళుని పొగడెదము
పాప పరిహారుని పాడెదము

1. దూతలు స్తుతించు మహోన్నతుడు
కన్యమరియ యందు జన్మించెను
మహియందు చీకటి పోగొట్టి
ఇహపర సుఖముల దయచేసెను
|| దేవదేవుని ||

2. పాపశాపమును తీర్చను
పాట్లుపడెను దేవ గొఱ్ఱెపిల్ల
హా! మంచి గొఱ్ఱెల బోయడే
ప్రాణము నిచ్చెను మనకై
|| దేవదేవుని ||

3. పాపముల కడిగి రక్షించెను
కృపనిచ్చె వేచియుండుటకై
వైరిని జయింపను శక్తినిచ్చెను
నరులకు భాగ్యము నందించెను
|| దేవదేవుని ||

4. ఆకాశము నుండి దిగి వచ్చును
లోకమున్ న్యాయము తీర్చుటకై
ఆయత్తముగ కాచియుండెదము
పాయక వివేక కన్యల వలె
|| దేవదేవుని ||

5. తన స్వరూపము నే దాల్చను
ఆయనే నా రూపము దాల్చెన్
దాసుడనగు నన్ను రక్షింపన్
యేసు నరరూపము దాల్చెన్
|| దేవదేవుని ||

6. పాతాళ లోకము కూల్చవచ్చెన్
జాతి యడ్డుగోడ పడగొట్టెను
నిత్య జీవంబు నియ్యను వచ్చెను
నీతి సూర్యుడు ప్రభు యేసువే
|| దేవదేవుని ||

7. హల్లెలూయ పాడి ఆర్భటింతుము
హర్షముతో యేసున్ చాటెదము
బలుడైన తండ్రిని కీర్తింతుము
విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము
|| దేవదేవుని ||

నా ప్రాణ ప్రియుడా యేసురాజా

“ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” యెషయా Isaiah 9:6

పల్లవి : నా ప్రాణ ప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా

1. అధ్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్
|| నా ప్రాణ ప్రియుడా ||

2. విమోచన గానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా
|| నా ప్రాణ ప్రియుడా ||

3. గర్భమున పుట్టిన బిడ్డను – కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీవెన్నడు
మరువవు విడివవు ఎడబాయవు – కరుణారాజా
|| నా ప్రాణ ప్రియుడా ||

4. రక్షణాలంకారములను – అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు – స్తుతింతును
|| నా ప్రాణ ప్రియుడా ||

5. నీ నీతిని నీ రక్షణను – నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును – విమోచకుడా
|| నా ప్రాణ ప్రియుడా ||

6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ – విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ
|| నా ప్రాణ ప్రియుడా ||

ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు

“దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడా బ్రతికించెను.” ఎఫెసీయులకు Ephesians 2:4

పల్లవి : ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా!

1.నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు
నీ మహిమే మేటి
|| ప్రభుని ||

2. ప్రభూ నీ శరణాగతులగువారు
విడుదల నొందెదరు
|| ప్రభుని ||

3. పాపుల కొరకై సిలువను మోసి
ప్రాణంబిడె నిలలో
|| ప్రభుని ||

4. మా ప్రభువా మా మొరనాలించి
నీ జ్ఞానంబిమ్ము
|| ప్రభుని ||

సర్వోన్నత స్థలంబులో – దేవునికే మహిమ

మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” ప్రకటన Revelation 22:1-2

“చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను. లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.” యెషయా Isaiah 41:19

పల్లవి : సర్వోన్నత స్థలంబులో – దేవునికే మహిమ
సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను

అనుపల్లవి : సర్వోన్నతుండగు దేవుని – సేవకులై యుండియు
సర్వోన్నతుని చిత్తంబున – సర్వదా స్తుతియించెదము
1. పరలోక యెరూషలేమున – పరిశుద్ధుల సంఘంబు
మురియుచు భర్త యేసుకై – అరుదెంచుచుండెను
పరిశుద్ధ పట్టణమందున – ప్రభు యేసు క్రీస్తుండు
ప్రకాశమానదీపమై – ప్రజ్వలించుచు నుండె
|| సర్వోన్నత ||

2. దేవుని సింహాసనమున – దేవుని మహిమలో
సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల
జీవుల మధ్యనుండెను – దేవుని గొర్రెపిల్ల
ఘనత మహిమ ప్రభావము – యుగయుగములు ఆయనకే
|| సర్వోన్నత ||

3. స్ఫటికంబు బోలినట్టి మెరయు – జీవ జలనది
పట్టణపు వీధులలో – ప్రవహించుచుండెను
స్ఫటికంపు నది కిరుప్రక్కల – జీవ ఫలవృక్షంబు
స్వస్థత కలిగించును – వృక్షంపు యాకులు
|| సర్వోన్నత ||

4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్
మెండైన నదుల నీళ్ళను – దండిగ పారించెన్
బండైన క్రీస్తును చీల్చెను – ప్రభుదేవుండే మనకు
నిండార నింపు నాత్మను – తండ్రి విధేయులన్
|| సర్వోన్నత ||

5. మెట్టల స్థలమందున – నదుల పారజేతున్
ఊటల నెన్నో లోయల – నుబుకంగ జేతును
నీటిమడుగులుగా మార్చెద – నరణ్యము నంతటిని
నీటి బుగ్గలుగా చేతును – ఎండిన నేలను
|| సర్వోన్నత ||

6. దావీదు పట్టణమందున – దావీదు సంతతిలో
దేవుని సర్వశక్తితో – జన్మించె యేసుండు
దావీదు తాళము కలిగి – తన సింహాసనమందు
తావిచ్చి చేర్చుకొనును – జయించువారిని
|| సర్వోన్నత ||

7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు
విలువైన రక్తము కార్చెను – మలినంబు బోగొట్టన్
బలుడైన ఆత్మ శక్తితో – గెలిచె సమాధిని
బలమిచ్చును పరిశుద్ధులకు – హల్లెలూయా పాడెదము
|| సర్వోన్నత ||