ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి

ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి
దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప||

1. ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు
శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప||

2. కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ
నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప||

3. చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా
కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||యే పాప||

4. ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు
సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||యే పాప||

5. పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా
సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా
||యే పాప||

6. బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము ||యే పాప||

7. కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా
ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి
||యే పాప||

ఆహా మహాత్మ హా శరణ్యా

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను
నా దోషమేగదా ||యాహా||

1. “వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్” కోరి తిటులు నిన్నుఁ
జంపు క్రూరజనులకై ||యాహా||

2. “నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు” పావనుండ యిట్లుఁ బలికి
పాపిఁ గాచితి ||వాహా||

3. “అమ్మా! నీ నుతుఁడ” టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర “నీ
జనని” యంచుఁ గర్త నుడివితి ||వాహా||

4. “నా దేవ దేవ యేమి విడ నాడితి” వనుచు శ్రీదేవ సుత పలికితివి
శ్రమ చెప్పశక్యమా ||యాహా||

5. “దప్పికొనుచున్నా న” టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా! ||యాహా||

6. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా “సమాప్తమైన” దంచుఁ
దెలిపి సమసితివి గదా ||యాహా||

7. “అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ” నంచును గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా ||యాహా||