దేవా నాయందు నీకు – ఎంతో ప్రేమా

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.” యిర్మియా Jeremiah 31:3

పల్లవి : దేవా నాయందు నీకు – ఎంతో ప్రేమా
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
హల్లెలూయా … (4)

1. దిన దినము నీదు ప్రేమ – రుచిచూచుచున్నాను
దయగల జీవాహారముతో – పోషించుచున్నావు
దేవా! నీ జీవ జలము – నాకిచ్చితివే
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

2. నా పాదములను నీవు – బండపై నిలిపితివి
నా యడుగుల నెల్ల నీవు – స్థిరపరచిన దేవుడవు
దేవా! నా కాశ్రయుడవు – నీవే కదా
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

3. సిలువలో నీ రక్తము కార్చి – నన్ను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన – నన్నైక్య పరచితివి
దేవా నీ దయ నా యెడల – అత్యున్నతము
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

4. వాగ్దానములను నాలో – నెరవేర్చిన ఓ ప్రభువా
విడువక నా యెడల నీదు – కృప జూపుచున్నావు
దేవా! నీ మారని ప్రేమ – సంపూర్ణము
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

5. మృతిని గెల్చి మాకొరకై – తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై – యున్న మహిమ రాజా
దేవా! నీ సన్నిధి నాకు – ఎంతో ప్రియము
నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను
|| దేవా ||

కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా

“నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు” పరమ గీతము Song Of Songs 5:10

పల్లవి: కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా

1. పరిశుద్ధుడవు నీతిమంతుడవు
పాపపు వస్త్రము మార్చిన దేవ
ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను ధవళవర్ణుడా

2. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి
బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను నీ ఘనవిజయము
భజియించెద నిన్ను రత్నవర్ణుడా

3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను
ఘనుడా నాకు ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద

4. ఆరాధించెద ప్రభువా దేవా
ఆత్మతోను సత్యముతోను
తిరిగి రానై యున్న ప్రభువా
స్తుతియు ఘనత మహిమయు నీకే

క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ

“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు.” ప్రకటన Revelation 14:3

క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ
యేసుని కీర్తింతును
పరిమళ తైలమును పోలిన
నీ నామమునే ప్రేమింతును

పల్లవి : హల్లెలూయా స్తుతి హల్లెలూయా
నా ప్రభు యేసుని గూర్చి పాడెదను
ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన
ప్రభుని కీర్తింతును

1. గత కాలమంతయు కాపాడెన్
కష్టబాధలు కలుగకుండ
తన ఆశీర్వాదంబులు నాకొసగి
సుఖభద్రతనిచ్చెన్
||హల్లెలూయా||

2. కొన్ని వేళలు క్షణకాలము
తన ముఖమును కప్పుకొనెను ప్రభువే
తన కోపము మాని తిరిగి నా యెడల
కుమ్మరించును కృపను
||హల్లెలూయా||

3. కరువు లధికంబగు చుండినను
ప్రభు ఆశ్రయముగనుండు
పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ
ప్రభు మమ్ము కాపాడెన్
||హల్లెలూయా||

4. ప్రభు త్వరగా వచ్చును సంతసముగ
మమ్ము జేర్చను పరమందు
కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు
ఆశతో గాంచెదము
||హల్లెలూయా||

మహాఘనుడు మహోన్నతుడు

“మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసి” యెషయా Isaiah 57:15

పల్లవి : మహాఘనుడు మహోన్నతుడు
పరిశుద్ధుడు నిత్యనివాసి
మా సామర్థ్యము పునరుత్థానము
మా జీవము మా రక్షణనిధి

1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో
నివసించువాడు పరిశుద్ధుడు
అయినను – నలిగిన వినయంపు
దీనమనస్సులో నివసించును జీవించును
|| మహాఘనుడు ||

2. దినమెల్ల ప్రభుకై వధియింప
బడి యున్నట్టి గొఱ్ఱెలము
అయినను – ప్రేమించినవాని
ప్రేమను బట్టియే పొందితిమి విజయమును
|| మహాఘనుడు ||

3. మోసము శిక్షయు దుఃఖమును
దరిద్రత కలిగియున్నాము
అయినను – సత్యము జీవము
సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి
|| మహాఘనుడు ||

4. పడిపోయి మేముంటిమి
అంధకారమందుంటిమిగా
అయినను – తిరిగి లేతుము
యెహోవాయే మా వెలుగు మా రక్షణ
|| మహాఘనుడు ||

5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు
నిందకు పాత్రులమైతిమి
అయినను – ఎల్లప్పుడు వూరేగించును
మమ్ము విజయముతో స్తోత్రములు
|| మహాఘనుడు ||

సర్వ కృపానిధియగు ప్రభువా

“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు.” ప్రకటన Revelation 14:3

సర్వ కృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తొత్రముచేసి స్తుతించెదము
సంతసముగ నిను పొగడెదము

పల్లవి : హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను
ఆనందముతో సాగెదను
నే నానందముతో సాగెదను

1. ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి
|| హల్లెలూయా ||

2. అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృప నిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడచుటకు నను పిలచితివి
|| హల్లెలూయా ||

3. మరణ శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చీతివి
|| హల్లెలూయా ||

4. భువినుండి శ్రేష్ఠ ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండినను
ప్రేమించి క్రయధన మిచ్చితివి
|| హల్లెలూయా ||

5. ఎవరు పాడని గీతమును
యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను
యేసుకు నేనేమివ్వగలను
|| హల్లెలూయా ||