సైన్యముల యెహోవా

పల్లవి : సైన్యముల యెహోవా

1. యెహోవా మందిరము చూడవలెనని
నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను
|| సైన్యముల ||

2. జీవముగల దేవుని దర్శించ నా హృదయము
నా శరీర మానంద కేక వేయుచున్నది
|| సైన్యముల ||

3. సైన్యముల యెహోవా నా రాజా నీ బలి
పీఠమునొద్దనే పిచ్చుకలకు గూళ్ళు దొరికెను
|| సైన్యముల ||

4. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు
గూటి స్థలము దొరికెను నా దేవా
|| సైన్యముల ||

5. నీ మందిరములో నుండువారు ధన్యులు
వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు
|| సైన్యముల ||

6. నీవలన బలము నొందు వారు ధన్యులు
యాత్ర మార్గము లతి ప్రియములు వారికి
|| సైన్యముల ||

7. వారు బాకా లోయలోబడి వెళ్లుచు
దానిని జలమయముగా చేయుదురు
|| సైన్యముల ||

7. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును
వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు
|| సైన్యముల ||

7. వారిలో ప్రతివాడు సీయోనులోని
దేవుని సన్నిధిలో కనబడును
|| సైన్యముల ||

మన బలమైన యాకోబు దేవునికి

పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి
గానము సంతోషముగా పాడుడీ

అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి
సితార స్వరమండలము వాయించుడి

1. అమావాస్య పున్నమ పండుగ దినములందు
కొమ్మునూదుడి యుత్సాహముతోడ
యాకోబు దేవుడు నిర్ణయించిన
ఇశ్రాయేలీయుల కది కట్టడ
|| మన బలమైన ||

2. తానైగుప్తులో తిరిగినప్పుడు
యోసేపు సంతతికి సాక్షముగ
నిర్ణయించెను దేవుడు అచ్చట
నే నెనుగని భాషను నే వింటిని
|| మన బలమైన ||

3. తమభుజము నుండి బరువు దింపగ
మోతగంపల భారము దప్పెను
నీవాపదయందు మొఱపెట్టగా
విడిపించిన యెహోవాను నేనే
|| మన బలమైన ||

4. ఉరుము దాగుచోటులో నుండినే
ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
మెరీబా జలముల యొద్ద నిన్ను
నా ప్రజలారా నా మాట వినుడి
|| మన బలమైన ||

5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను
రప్పించిన యెహోవా దేవుడను
నీవు నీ నోరు బాగుగా తెరువుము
నేను నింపెదను మంచి వాటితో
|| మన బలమైన ||

6. అతి శ్రేష్ఠమైన గోధుమలను
అనుగ్రహించి పోషించెద నిన్ను
కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో
తృప్తి పరచెదను నిత్యముగా
|| మన బలమైన ||

7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట
వినిన పక్షాన ఎంత మేలగు
అన్యదేవతల నెవ్వరికిని
నీవు ఎన్నడు పూజ చేయరాదు
|| మన బలమైన ||

దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి

1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి
చెవియొగ్గువరకు మనవి చేయుచుందును

2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను
ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును

3. పూర్వ సంవత్సరములను తలచుకొందును
పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును

4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు
శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది

5. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా?
ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా?

6. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా?
దేవుడు కోపముతో కృప చూపకుండునా?

7. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను
అనుకొనుటకు నా శ్రమలే కారణము

8. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను
తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు

9. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును
నీ క్రియలను ధ్యానము నే జేసికొందును

10. మహా పరిశుద్ధమైనది నీదు మార్గము
మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?

11. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే
జనములలో ప్రభావమును చూపియున్నావు

యూదాలో దేవుడు ప్రసిద్ధుడు

పల్లవి : యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో తన నామము గొప్పది

అనుపల్లవి : షాలేములో తన గుడారమున్నది
సీయోనులో తన ఆలయమున్నది

1. అక్కడ వింటి అగ్ని బాణములను
తాను అక్కడి కేడెముల కత్తులను
అక్కడ యుద్ధ ఆయుధములను
తాను అక్కడి వాటిని విరుగగొట్టెను
దుష్ట మృగములను పర్వతముల యందము
కన్నను నీవెంతో తేజోమయుడవు
|| యూదాలో ||

2. కఠినహృదయులు దోచుకొనబడి
వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలు లందరిని – వారి
బాహు బలమును హరించెను
యాకోబు దేవా నీదు గద్దింపునకు
రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను
|| యూదాలో ||

3. నీవు భయంకరుడవు దేవా – నీవు
కోపపడు వేళ నిల్చువాడెవడు?
ఆకాశము నుండి తీర్పు వినబడెను
నీవు దేశంబులో శ్రమనొందు వారిని
రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
భూమి భయమునొంది ఊరకయుండును
|| యూదాలో ||

4. నరుల కోపము నిన్ను స్తుతించును
వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి
తన చుట్టు కానుకలు అర్పించవలెను
అధికారుల గర్వమణచి వేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు
|| యూదాలో ||

క్రీస్తుని నామము నిత్యము నిల్చున్

1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్
సూర్యుడున్నంత కాలము చిగుర్చున్

2. అతనినిబట్టి మానవులెల్లరు
తథ్యముగానే దీవించబడెదరు

3. అన్యజనులందరును అతని
ధన్యుడని చెప్పుకొను చుందురు

4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
దేవుడు స్తుతింపబడును గాక

5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు
చేయువాడు గాన స్తోత్రార్హుండు

6. ఆయన మహిమగల నామము
నిత్యమును స్తుతింపబడును గాక

7. సర్వభూమి ఆయన మహిమచే
నిండియుండును గాక ఆమెన్‌ ఆమెన్‌