దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా

“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14

పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా
నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా

1. దేవా నా రక్షణకర్త – నీవే నాసహాయుడవు
నన్ను దగనాడవలదు – నన్ను విడువకుము
|| దేవా నీ ||

2. నాదు తలిదండ్రులు – నన్ను విడచినను
నా దేవుండగు యెహోవా – నన్ను చేరదీయును
|| దేవా నీ||

3.నాకై పొంచియున్నట్టి – వారిని చూచి నన్ను
సరళ దారిని నడుపు – మంచి మార్గము భోధించు
|| దేవా నీ ||

4. నాపై లేచియున్నారు – అబద్ధ సాక్షులు క్రూరుల్
నన్నప్పగించకు దేవా – నాదు విరోధులకు
|| దేవా నీ ||

5. యెహోవా దయ పొందెదను – సజీవుల దేశమున
ఇట్టి నమ్మకము లేని – యెడల నే నేమగుదును
|| దేవా నీ ||

6. ధైర్యము తెచ్చుకొని – నిబ్బర హృదయము గల్గి
యెహోవా దేవుని కొరకు – కనిపెట్టుకొని యుండుము
|| దేవా నీ ||

భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే

“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10

పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే

1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను
|| భూమియు ||

2. యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు
|| భూమియు ||

3. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే
|| భూమియు ||

4. నిన్నాశ్రయించి నీ సన్నిధిని – వెదకెడివాడు
వాడాశీర్వాదము నీతి – మత్వము నొందును
|| భూమియు ||

5. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి
|| భూమియు ||

6. మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే
|| భూమియు ||

7. మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్
|| భూమియు ||

యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట

1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతి
ముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును
|| యేసు ప్రభూ ||

2. మరణపులోయ ద్వారా – సరిగా నడిపించును
అడవి భయములెల్ల – ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా – లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో – సంతోషింతును
|| యేసు ప్రభూ ||

3. శత్రుల ముందాహారం – సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి – పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి – ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున – జయమున వెళ్ళెదను
|| యేసు ప్రభూ ||

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్

1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్
|| యెహోవా ||

2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము
|| యెహోవా ||

3. నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

4. చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసముగా నుందున్
|| యెహోవా ||

నీవే యెహోవా నా కాపరివి

“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23

పల్లవి : నీవే యెహోవా నా కాపరివి
నాకేమి కొదువ లేదిలలోన

1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
నా ప్రాణమునకు సేదను దీర్చి
నన్ను నడుపుము నీతిమార్గమున
|| నీవే యెహోవా ||

2. గాఢాంధకార లోయలయందు
పడియుండి నేను సంచరించినను
తోడైయుందువు నీ దుడ్డుకర్ర
దండముతో నీ వాదరించెదవు
|| నీవే యెహోవా ||

3. శత్రువుల యెదుట నీవు నాకు
నిత్యమగు విందు సిద్ధపరచి
నాతల నూనెతో నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| నీవే యెహోవా ||

4. నిశ్చయముగా కృపాక్షేమములే
వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
చిరకాలము యెహోవా మందిరమున
స్థిరముగా నే నివసించెదను
|| నీవే యెహోవా ||