సీయోనులో స్తిరమైన పునాది నీవు

సీయోనులో స్తిరమైన పునాది నీవు 
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు 

సూర్యుడు లేని - చంద్రుడు లేని 
చీకటి రాత్రులు - లేనే లేని 
ఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా   || సీయోనులో || 

కడలిలేని - కడగండ్లులేని 
కల్లోల స్థితిగతులు - దరికే రాని 
సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా          || సీయోనులో ||
 
కలతలు లేని - కన్నీరు లేని 
ఆకలి దప్పులు - అసలే లేని 
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా  || సీయోనులో ||
 
సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము 
సౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతును 
నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే               || సీయోనులో ||

నా హృదయాన కొలువైన యేసయ్యా

నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2)        ||నా హృదయాన||

అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2)        ||నా హృదయాన||

అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2)        ||నా హృదయాన||

విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2)        ||నా హృదయాన||

నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం||

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున

వర్ధిల్లెదము - మన దేవుని మందిరమందున నాటబడినవారమై 
నీతిమంతులమై - మొవ్వ వేయుదుము 
యేసు రక్తములోనే - జయము మనకు జయమే 
స్తుతి స్తోత్రములోనే - జయము మనకు జయమే 

యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు 
ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతి మేలును || వర్ధి  || 

యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు 
ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధి || 

పరిశుద్ధాత్ముని అభిషేకములో - ఎంతో ఆదరణ కలదు 
ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును || వర్ధి  ||

రాజ జగమెరిగిన నా యేసురాజా

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన 
మన బంధము - అనుబంధము 
విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ? 

దీన స్థితియందున - సంపన్న స్థితియందున 
నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే 
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || 

బలహీనతలయందున- అవమానములయందున 
పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే 
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||

సీయోను షాలేము - మన నిత్య నివాసము 
చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము 
ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||