నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు

1. నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు
నీ రక్షణ అన్యులలో – తెలియబడు గాక
|| నీ మార్గము ||

2. దేవుడు మమ్ము కరుణించి – దీవించును గాక
ప్రకాశింపజేయుము నీ – ముఖకాంతిని మాపై
|| నీ మార్గము ||

3. స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను
స్తుతియించెదరు గాక మా – దేవా ప్రజలు నిన్ను
|| నీ మార్గము ||

4. యెహోవా నీతితో నీవు – న్యాయము తీర్చెదువు
ఏలెదవు భూమిమీద – నున్న జనులను
|| నీ మార్గము ||

5. జనులానంద యుత్సాహ – ధ్వని చేయుదురు గాక
జనులు దేవా నిన్ను – స్తుతియించెదదు గాక
|| నీ మార్గము ||

6. భూమి ఫలియించును యెహో – వా మమ్ము దీవించును
భూలోకులందరు దైవ – భక్తి కల్గి యుందురు
|| నీ మార్గము ||

సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు 

పల్లవి :సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు
దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి

1. ఆయన నామ ప్రభావమును – కీర్తించి స్తోత్రించుడి
ఆయనకు ప్రభావము – ఆరోపించి స్తుతించుడి
|| సర్వలోక ||

2. నీదు కార్యములు ఎంతో – భీకరమైనట్టివి
నీ బలాతిశయమును బట్టి – శత్రువులు లొంగెదరు
|| సర్వలోక ||

3. సర్వలోకమును నీకు – నమస్కరించి పాడును
నీదు నామమును బట్టి – నిన్ను కీర్తించును
|| సర్వలోక ||

4. చూడరండి దేవుని – ఆశ్చర్య కార్యములన్
నరుల యెడల చేయు పనుల – వలన భీకరుండహా
|| సర్వలోక ||

5. సాగరమును ఎండినట్టి – భూమిగను మార్చెను
జనులు కాలినడక చేత – దాటిరి సముద్రమున్
|| సర్వలోక ||

6. ఆయనలో హర్షంచితిమి – నిత్యమేలుచున్నాడు
అన్యజనుల మీద తన – దృష్టి యుంచి యున్నాడు
|| సర్వలోక ||

గీతం గీతం జయ జయ గీతం

గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2)

1. చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు

2. వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి

3. అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్
బూరలెత్తి ధ్వనించుడి

 

దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును

పల్లవి : దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును

1. నీ ప్రభావ బలమును చూడ – నీ పరిశుద్ధాలయమందు
నే నెంతో ఆశ తోడ – నీ వైపు కాచియున్నాను
|| దేవా ||

2. నీళ్లు లేక యెండిన చోట – నా ప్రాణము నీ కొరకు
దాహము గొని యున్నది – నీ మీద ఆశచేత
|| దేవా ||

3. నిను చూడ నా శరీరం – కృశించి పోవుచున్నది
నీ కృప జీవముకంటె శ్రేష్ఠం – నా పెదవులు నిన్ను స్తుతించున్
|| దేవా ||

4. నా పడక మీద నిను దలచి – రాత్రి జాములో ధ్యానించునపుడు
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లు – నా ప్రాణము తృప్తి నొందుచున్నది
|| దేవా ||

5. ఉత్సాహముతో నా నోరు – నిన్నుగూర్చి పాడుచున్నది
నా జీవిత కాలమంత – ఈలాగున నిన్ను స్తుతియించెదన్
|| దేవా ||

6. నా సహాయుడా నీ పేరు – బట్టి నా చేతు లెత్తెదను
నీ చాటున శరణు జొచ్చి – ఉత్సాహధ్వని చేసెదను
|| దేవా ||

7. నను చంప వెదకెడి వారు – పాతాళమునకు పోయెదరు
ఖడ్గంబునకు గురియై – మరి నక్కలపాలగుదురు
|| దేవా ||

8. దేవుని బట్టి రాజానందించున్ – తన తోడు ప్రమాణము చేయు
ప్రతివాడు అతిశయించును – మూయబడు నబద్ధికుల నోరు
|| దేవా ||

యెహోవా నా దేవా

దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము
కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము

పల్లవి : యెహోవా నా దేవా

1. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
|| యెహోవా నా దేవా ||

2. నీకు విరోధముగానే – పాపము చేసియున్నాను
నీ దృష్టి యెడల చెడు – తనము నే చేసియున్నాను
|| యెహోవా నా దేవా ||

3. ఆజ్ఞ యిచ్చునపుడు – నీతిమంతుడవుగను
తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు
|| యెహోవా నా దేవా ||

4. పాపములోనే పుట్టిన – వాడను పాపములోనే
నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
|| యెహోవా నా దేవా ||

5. నీ వంతరంగమున – సత్యము కోరుచున్నావు
ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు
|| యెహోవా నా దేవా ||

6. హిస్సోపుతో శుద్ధీకరించు – పవిత్రుడనగుదును
హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
|| యెహోవా నా దేవా ||

7. ఉత్సాహ సంతోషములు – నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన – యెముకలు హర్షించును
|| యెహోవా నా దేవా ||