ప్రవిమలుడా పావనుడా – స్తుతిస్తోత్రము నీకే

“దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” రోమా Romans 5:5

పల్లవి : ప్రవిమలుడా పావనుడా – స్తుతిస్తోత్రము నీకే
పరమునుండి ప్రవహించె – మాపై కృప వెంబడి కృపలు

1. నీ మందిర సమృద్ధివలన – తృప్తిపరచు చున్నావుగా
ఆనంద ప్రవాహ జలమును – మాకు త్రాగనిచ్చితివి
కొనియాడెదము నీ కృపకై ఆనందించుచు పాడెదము
|| ప్రవిమలుడా ||

2. దేవుని సంపూర్ణతలో మమ్ము – పరిశుద్ధులుగా జేసియున్నావు
జ్ఞానమునకు మించిన ప్రేమ మాలో బయలు పరచితివి
కృతజ్ఞతలు చెల్లించుచు పూజించెదము నిన్నెప్పుడు
|| ప్రవిమలుడా ||

3. దైవత్వము నిండియుండెనుగా క్రీస్తు యేసు ప్రభువునందు
ఆయనయందు సంపూర్ణులుగా మమ్ము జేసియున్నావు
సాగిలపడుచు నీ కృపకై ఆరాధింతుము నిన్నిలలో
|| ప్రవిమలుడా ||

4. నిర్ధోషులుగా నిరపరాధులుగా నీ రక్తముతో మము జేసితివి
సర్వసంపూత్ణత మాకిచ్చి సిలువలో సంధిజేసితివి
నిత్యము నిన్ను స్తుతించి ఘనపరచెదము నిన్నిలలో
|| ప్రవిమలుడా ||

5. కృపా సత్యసంపూర్ణుడవై మామధ్యలో నివసించితివి
లోకమునందు నమ్మబడితివి అద్వితీయ తనయుడవై
నిరతము నిన్ను కీర్తించి సమాజములో పాడెదము
|| ప్రవిమలుడా ||

స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు

“నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక.” కీర్తన Psalm 70:4

పల్లవి : స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా

1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సహించి సంతోషించెదము
కొనియాడెదము మరువబడని మేలులజేసెనని
|| స్తుతియు ||

2. నీ వొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు
నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము
|| స్తుతియు ||

3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై
ఖ్యాతిగ నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా
|| స్తుతియు ||

4. నీవే మాకు పరమప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా
నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను
|| స్తుతియు ||

5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మాకొరకై
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్
పరము నుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము
|| స్తుతియు ||

ప్రణుతింతుము మా యెహోవా

“యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” కీర్తన Psalm 4:8

పల్లవి : ప్రణుతింతుము మా యెహోవా
పరిపూర్ణ మహిమ ప్రభావా
ప్రబలెన్ నీ రక్షణ మా విభవా

1. నేను నిదురబోయి మేలు కొందును
నాపైన పదివేలు మోహరించినను
నేనెన్నడు వెరువబోను
|| ప్రణుతింతుము ||

2. నా మీదికి లేచి భాధించువారు
వానికి రక్షణ లేదనువారు
వేలాదిగా నిల్చినారు
|| ప్రణుతింతుము ||

3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు
విలపించి వేడినయట్టి దినమందు
వింతగ రక్షించితివంచు
|| ప్రణుతింతుము ||

4. రక్షణనిచ్చుట మన యెహోవాది
రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు
రంజిల్లు నీ ధరణియందు
|| ప్రణుతింతుము ||

5. నీ అందచందాల మోము మెరిసింది
నీ మాటలమృత ధారలొలికింది
నిన్నే ప్రేమించి పూజింతున్
|| ప్రణుతింతుము ||

రాత్రింబవళ్లు పాడెదను

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” లూకా Luke 12:32

పల్లవి : రాత్రింబవళ్లు పాడెదను
యేసు నామం – క్రీస్తు నామం

1. పురుగు వంటి నరుడ నాకు – ప్రభువు రాజ్య మియ్యదలచి
పరమునుండి ధరకేతెంచి – ప్రాణమున్ బలిగా నిచ్చె
|| రాత్రింబవళ్లు ||

2. ఎన్నిక లేని చిన్నమంద – భయపడకు నీవిలన్
ఘనమైన పరమతండ్రి – రాజ్యమివ్వ నిష్టపడెన్
|| రాత్రింబవళ్లు ||

3. పాప కూపమునందు నేను – పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి పరమ – రాజ్యమందు చేర్చెను
|| రాత్రింబవళ్లు ||

4. నీతి హీనుడనైన నాకు – నీతి రాజ్యమివ్వదలచి
నీతి రక్షణ వస్త్రములను – ప్రీతి తోడ తొడిగెను
|| రాత్రింబవళ్లు ||

5. పేరుపెట్టి పిలచినన్ను – పరమ రాజ్యమును తండ్రి
వారసునిగా నన్ను జేసి – వైరినిల సిగ్గుపరచెన్
|| రాత్రింబవళ్లు ||

6. పరమునందు దూతలు – వింత పొందునట్లుగా
ఏర్పరచుకొంటివి నరుని – నరుడు ఏపాటి వాడు?
|| రాత్రింబవళ్లు ||

7. దానియేలు షద్రక్ మేషాక్ – అబెద్నెగో యనువారలన్
చిన్నమందగాను జేసి – రాజ్యమేల జేసెన్
|| రాత్రింబవళ్లు ||

8. ఎన్ని శ్రమలు వచ్చినను – సన్నుతింతు నా ప్రభున్
ఘనత మహిమ కర్హుడని – హల్లెలూయ పాడెదన్
|| రాత్రింబవళ్లు ||

కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను

“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” కీర్తన Psalm 121

పల్లవి : కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును?

1. భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్
|| కొండలతట్టు ||

2. నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు
|| కొండలతట్టు ||

3. ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు ఎన్నడు
|| కొండలతట్టు ||

4. యెహోవాయే నిన్ను కాపాడును
కుడిప్రక్క నీడగా నుండును
|| కొండలతట్టు ||

5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగులకుండ కాపాడును
|| కొండలతట్టు ||

5. ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణము కాపాడున్
|| కొండలతట్టు ||

5. ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను కాపాడున్
|| కొండలతట్టు ||